కన్నుల పండువగా కొనసాగుతున్న గణేష్‌ శోభా యాత్ర

జై బోలో గణేష్‌ మహరాజ్‌కు అంటూ ఖైరతాబాద్‌ శోభా యాత్ర కన్నుల పండువగా సాగుతోంది. జై జై గణేషా అంటు కొందరు.. బై బై గణేషా అంటూ ఇంకొందరు నినాదాలతో మార్మోగిస్తున్నారు. హుస్సేన్‌ సాగర్ పరిశరాల్లో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. మహిళలు, పిల్లలు, యువత అని తేడాలేకుండా అందరూ నృత్యాలతో సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్విరామంగా ఖైరాతాబాద్‌ సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ దగ్గర కొనసాగుతోంది. వేలాదిగా భక్తుల కోలాహలం మధ్య గంగమ ఒడికి చేరేందుకు వడి వడిగా మహా గణపతి ముందుకు కదులుతున్నాడు..

తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర ఎన్టీఆర్‌ మార్గ్‌ గుండా హుస్సేన్‌సాగర్‌ చేరుకొనుంది. హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేసిన ఆరో నంబర్‌ క్రేన్‌ వద్ద ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మధ్యాహ్నం ఒంటి గంటలోపే మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.