మావోయిస్టు కార్యకలాపాలు విస్తృతం

maoist-in-vishaka

కనుచూపు మేర పచ్చదనం..ఎత్తైన కొండలు..భయంపుట్టించే లోయలు. ప్రకృతి రమణీయతతో ఓలలాడుతున్న అరకు వ్యాలీ పల్లెలు ఇప్పుడు భయం గుప్పిట్లో గడుతున్నాయి. కొద్ది నెలలుగా మావోయిస్టుల కార్యకలాపాలతో టూరిస్ట్ స్పాట్ డేంజర్ స్పాట్ గా మారుతోంది.

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో కొన్నేళ్లుగా కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతను చేపట్టాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన ఫలితాలను సాధించింది. మవోయిస్టుల ఏరివేతలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది. దీంతో మావోయిస్టులు..ఏపీని వదిలి చత్తీస్ గఢ్, ఒడిషా అటవీ ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చుకున్నారు. అయితే..కొద్ది కాలంగా మల్కాన్ గిరి జిల్లాలో కేంద్ర బలగాలు పట్టుబిగించాయి. దీంతో మావోయిస్టులకు ఎదరుదెబ్బలు తగిలాయి. 2016లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకంగా 27 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో మల్కాన్ గిరి నుంచి ఒడిషా సరిహద్దుకు సమీపంలో అరకు ప్రాంతంలో పట్టు పెంచుకునే పనిలో ఉన్నారు మావోయిస్టులు.

ఏడాదిన్నరగా విశాఖ ఏజెన్సీలోని అరకు ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. ముఖ్యంగా జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, ముచింగి పుట్టు, మాడుగుల ప్రాంతాలు మావోయిస్టులకు సేఫ్ జోన్ గా మారాయి. దీంతో ఏడాది కాలంలో ఆయా ప్రాంతాల్లో విధ్వంస ఘటనలు పెరిగిపోయాయి. అటవీ ప్రాంతాల పల్లెల్లో బ్లాక్ జెండాలు, మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. గతేడాది ఆగస్టులో అనంతగిరి మండలం డుముకులో ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు పర్యటనకు ముందే ఏపీఎస్ఆర్టీసీ బస్టాప్ పేల్చివేశారు. దీంతో అప్పట్లో చంద్రబాబు పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

భౌగోళికంగా కూడా అరకు ప్రాంతం తమకు సురక్షితమని భావిస్తున్నారు మావోయిస్టులు. ఒడిషాలోని నందపూర్ బ్లాక్ కు అతి సమీపంలో ఉండటం కూడా వారికి కలిసొచ్చే మరో అంశం. ఒడిషా సరిహద్దుకు అతి సమీపంలోని పల్లె, అటవీ ప్రాంతాలను తమ కొత్త బేస్ గా మార్చుకొని ఇటు ఏపీ, అటు ఒడిషాలో పట్టునిలుపుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. బాక్సెట్ కు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఉద్యమం వారికి మరింత కొలిసొచ్చింది. ప్రజల ఉద్యమానికి మద్దతునిస్తూ ప్రజాప్రతినిధులకు వార్నింగ్ లు ఇచ్చిన మావోయిస్టులు..స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై ఏజెన్సీలో సభలు సమవేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో అరకు వ్యాలీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజాప్రతినిధులు ఎవరు తమకు సమాచారం ఇవ్వకుండా అరకు ప్రాంతంలో పర్యటించొద్దని అలర్ట్ చేశారు. ఇన్నాళ్లు ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలకు తెగబడిన మావోయిస్టులు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను హత్య చేయటంతో అరకు లోయ మళ్లీ ఉద్రిక్తంగా మారింది.