కొనసాగుతున్న మహాగణపతి శోభాయాత్ర

హైదరాబాద్‌లో మహా నిమజ్జానికి శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్‌ నుంచి ప్రధాన శోభాయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం గణనాథుని శోభాయాత్ర సన్సేషన్‌ థియేటర్‌ దాటింది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేసిన ఆరో నంబర్‌ క్రేన్‌ వద్ద ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపే మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు.

నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌ సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 213 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్‌ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.