ఆ రెండు నియోజకవర్గాలు మాకే కేటాయించాలి : టీడీపీ

sherilingampalli ticket war

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో పంక్చర్‌ అయిన సైకిల్ పార్టీకి తాజా ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. మహకూటమి పొత్తుతో అతి తక్కువ స్థానాలలో మాత్రమే పోటీకి దిగనున్న టీటీడీపీ.. గెలుపుపై టెన్షన్ మొదలైంది. ప్రధానంగా పార్టీ లోని కీలక నేతలు గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన స్ధానాల కంటే పక్క సీట్లపై మక్కువ ఎక్కువైంది. టీటీడీపీలో చాలా మంది నేతలు గ్రేటర్ లోని రెండు నియోజకవర్గాలపై మనసు పడుతున్నారు. ఇంతకి ఆరెండు నియోజకవర్గాలు ఏవంటే ఒకటి హైటెక్ సిటీ కారిడార్ కు అడ్డాగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం. మరోటి ఆంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉన్న కూకట్‌పల్లి. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలలో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇక్కడ గెలుపొందిన ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు సైకిల్ దిగి వేగంగా కారు పార్టీలోకి చెక్కేసి.. ప్రస్తుతం టీఆరెఎస్ తరపున బరిలోకి దిగుతున్నారు. అయినా టీడీపీ తరపున పోటీకి నేతలు క్యూ కడుతున్నారు.

శేరిలింగంపల్లి టికెట్ కోసం పార్టీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ స్ధానం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయి తిరిగి టీడీపీ గూటికి చేరిన మొవ్వ సత్యనారాయణ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరోవైపు ఈ స్ధానం నుండి హీరో కళ్యాణ్ రామ్ ను బరిలోకి దింపుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఐతే ఇటీవలే తండ్రి హరికృష్ణ మరణంతో విషాదంలో ఉన్న కళ్యాణ్ రామ్ పోటీకి దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కూకట్ పల్లి నియోజకవర్గం పై కూడా టీటీడీపీ నేతలకు భారీ ఆశలే ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఆపార్టీ గెలిచిన ఏకైక డివిజన్ ఈ నియోజక వర్గంలోనే ఉంది. ప్రస్తుత టీటీడీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి ఇక్కడి నుండి పోటీ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడి నుండి కార్పొరేటర్ గా గెలుపొందిన మందాడి శ్రీనివాస్ కూడా బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లురుతున్నారు. మరోవైపు ఇటీవలే టీఆరెఎస్ కు రిజైన్ చేసిన పన్నాల హరీశ్ రెడ్డి టీడీపీ తరపున పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితం అమరావతిలో చంద్రబాబును కలిసిన ఆయన అవకాశం ఇస్తే పోటీకి సిద్దమని చెప్పి వచ్చారు. హరీష్ రెడ్డి సతీమణి ప్రస్తుతం టీఆరెఎస్ కార్పొరేటర్ గా ఉన్నారు. మరోవైపు టీడీపీలోని కొందరు పెద్దలు కూకట్ పల్లి లోని బలమైన ఫ్యామిలీ వడ్డేపల్లి నరసింగరావు కుటుంబసభ్యులను ఇక్కడి నుండి పోటీ చేయించాలనే యోచనలో కూడా ఉన్నారు.

శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలను రెండు తమకే కేటాయించాలని టీడీపీ ఇప్పటికే కాంగ్రెస్ ను కోరింది. కాంగ్రెస్ కూడా దీనికి సానుకూలంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాలలో ఆంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండటంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం ఓట్లు కూడా గణనీయంగా ఉండటంతో సైకిల్ పార్టీ నేతలకు ఈ స్ధానాలపై మక్కువ ఎక్కువైంది. మరి టికెట్లు ఎవరిని వరిస్తాయో చూడాలి.