అక్కడ పోలీస్‌స్టేషన్‌ ఉండి ఉంటే అరకు హత్య ఘటన జరిగేదికాదు..?

araku maoist attoack update

మండల కేంద్రం డుంబ్రిగుడలో పోలీస్‌స్టేషన్‌ ఉండి వుంటే మావోయిస్టులు ఇంత దూకుడుగా వ్యవహరించి ఉండేవారు కాదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఒడిశాకు ఆనుకుని వున్న ఈ మండలంలో గతంలో నక్సలైట్ల కదలికలు అధికంగా వుండేవి. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ ఒక చిన్న భవనంలో పోలీసు స్టేషన్‌ ఉండేది. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ పోలీసు స్టేషన్‌ను అరకులోయకు తరలించారు. అక్కడ ఒకే ప్రాంగణంలో రెండు పోలీసు స్టేషన్లను నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఆదివారం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను టార్గెట్‌గా చేసుకోవడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు.

పోలీసు స్టేషన్‌ దరివాపుల్లో లేకపోవడం, అరకులోయలోని స్టేషన్‌కు సమాచారం తెలిసి, పోలీసులు అక్కడి నుంచి రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. సాయుధులైన 60 మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు డుంబ్రిగుడ మండల కేంద్రానికి కేవలం కిలోమీటరున్నర దూరంలో ఉన్న లివిటిపుట్టు గ్రామాన్ని వేదికగా చేసుకుని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చారు. డుంబ్రిగుడలో పోలీస్‌స్టేషన్‌ ఉండి ఉంటే, మావోయిస్టులు ఇంత దారుణానికి ఒడిగట్టే అవకాశం ఉండేది కాదని స్థానిక గిరిజనులు అంటున్నారు.

ఆరేళ్ల క్రితం వరకు హుకుంపేటలో పోలీసు స్టేషన్‌ లేదు. హుకుంపేట మండలంతోపాటు, పక్కనే వున్న ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా వుండేవి. దీంతో ఈ పోలీస్‌స్టేషన్‌ పాడేరులో ఉండేది. హుకుంపేటకు చెందిన జడ్పీ వైఎస్‌ ఛైర్మన్‌ సమిడ రవిశంకర్‌ను 2007లో, ఎంపీపీ కొర్రా చిట్టిబాబును 2009లో మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటనల తర్వాత 2012లో హుకుంపేటలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యల అనంతరం ఏఓబీలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అట ఒడిషా, చత్తీస్ ఘడ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కోరాపుట్ ప్రాంతం నుంచే మావోలు వచ్చినట్టు ఏపీ పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆ రాష్ట్రం అలెర్ట్ అయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసేందుకు డ్రోన్ కెమేరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఒడిశా డీజీపీ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. ప్రత్యేకించి మల్కాన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో నక్సలైట్ల కదలికలపై నిఘా వేసేందుకు ఒడిశా పోలీసులు డ్రోన్లు వినియోగించనున్నారు.

విశాఖ ఏజెన్సీలో పోలీస్‌స్టేషన్లపై దాడులను నివారించడంలో విఫలమైన పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డుంబ్రిగూడ ఎస్సై అమర్‌నాథ్‌‌ను‌ సస్పెండ్ చేసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివారి సోమ హత్య, అనంతరం జరిగిన అల్లర్లను నివారించడంలో వైఫల్యం చెందాడంటూ ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ విషయం ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్‌ చేశామని డీజీపీ ఆర్పీఠాకూర్ చెప్పారు. కేసులో విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.