బిగ్ బ్రేకింగ్ : ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోయిస్టులు వీరే..

araku mla kidari sarveswararao murderer photos

విశాఖపట్నం జిల్లా అరుకులోయలో ప్రజా ప్రతినిధులను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలతో.. ముగ్గురు నేరుగా దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి ఫోటోలు విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులను హత్య చేసింది శ్రీనుబాబు, స్వరూప, అరుణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

అంతకుముందు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి. ప్రభుత్వ లాంచనాలతో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. అంతిమ యాత్ర నుంచి అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. సర్వేశ్వరరావు చితికి ఆయన పెద్ద కుమారుడు శ్రవణ్‌ నిప్పటించారు.

మంత్రులు చినరాజప్ప, సజయకృష్ణ, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, జవహర్‌ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సహా పలువురు ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.. ఇద్దరి స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. కిడారి కుటుంబాన్ని ఆదుకుంటామని చినరాజప్ప హామీ ఇచ్చారు.

గిరిజనుల కన్నీటి వీడ్కోలు మధ్య మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు వర్షంలోనే పూర్తయ్యాయి. అరకులోని ఆయన స్వస్థలం బట్టివలసలో నిర్వహించిన అంత్యక్రియలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికార లాంఛనాలతో క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు..

మరోవైపు ప్రజా ప్రతినిధుల హత్యతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడ పడుతున్నాయి. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారంటూ డుంబ్రిగూడ ఎస్‌ఐ అమ్మన్‌రావును డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్‌ ఏర్పాటుచేశారు.

ప్రజా ప్రతినిధుల హత్య, తరువాత బంద్‌ కారణంగా విశాఖ మన్యం మూగబోయింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకు లోయ కళ తప్పింది. కన్నీటి సంద్రమైంది. బంద్‌ కారణంగా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.