ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరూ కూడా ఈ సారి బరిలో ఉండే అవకాశాలు లేవు. పొత్తులు, వలసల కారణంగా మొత్తం సీను తారుమారైంది. పది నియోజకవర్గాల్లో ఒక్క భట్టి మినహా హస్తం పార్టీలో అంతా కొత్తవాళ్లేనా.?

మిత్రపక్షాలతో పొత్తులు.. తాజా రాజకీయ పరిణామాలు అన్నీ కలిసి ఒకప్పుడు ఉమ్మడి జిల్లా హస్తం పార్టీలో చక్రం తిప్పిన నాయకులకు ఈ సారి అవకాశం లేనట్టే. 2014లో సీపీఐతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఏడు స్థానాలకే పరిమితమైంది. ఏడింట్లో నాలుగు సీట్లు గెలుచుకుంది. ఖమ్మం నుంచి గెలిచిన పువ్వాడ అజయ్, ఇల్లెందు నుంచి గెలుపొందిన కోరం కనకయ్య TRSలో చేరారు. ఈ రెండుచోట్ల కాంగ్రెస్ కొత్తముఖాల వేటలో ఉంది. పాలేరు నుంచి గత ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. అయితే ఆయన మరణంతో మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో రాంరెడ్డి సతీమణి పోటీచేసి TRS నుంచి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి రాంరెడ్డి కుటుంబం నుంచి అవకాశం లేదని తెలుస్తోంది. కొత్తవారికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అశ్వారావుపేటలో 2014లో పోటీచేసిన మిత్రసేన ఓడిపోయారు. అనంతరం ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో కొత్త వారిని రంగంలో దింపుతున్నారు. భద్రాచలం నుంచి పోటీచేసిన కుంజా సత్యవతి బీజేపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. సీనియర్లు కూడా సీట్లు మారాలని చూస్తున్నారు. గతంలో సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడు నుంచి పోటీచేసిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఈ సారి తన సొంత ఊరున్న పాలేరు జనరల్ స్థానం పాలేరు ఆశిస్తున్నారు. అయితే పాలేరులో జలగం ప్రసాదరావును బరిలో దింపాలని పీసీసీ భావిస్తోంది. ఖమ్మం నుంచి ఎంపీ రేణుకాచౌదరి పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇతర కాంగ్రెస్ ఆశావహుల్లో కూడా అంతా కొత్తవారే కనిపిస్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆశిస్తున్నారు. మానుకొండ రాధాకిషోర్, పోట్ల నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర పేర్లున్నాయి. ఇల్లెందు నుంచి గతంలో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన హరిప్రియ రేసులో ఉన్నారు. మొత్తంగా మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క మినహా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున కొత్త ముఖాలు పోటీలో ఉంటాయని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.