గ్రేటర్‌ వాసులకు శుభవార్త.. నేటి నుంచి ఆ రూట్‌లో మెట్రో పరుగులు

metro

భాగ్యనగరానికి మణిహారంగా మారిన మెట్రో రైలు మరింత దూరం ప్రయాణికులకు సేవలనందించనుంది. అత్యంత రద్దీ ప్రాంతమైన ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట రూట్‌లో నేటి నుంచి పరుగులు పెట్టబోతోంది. గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 12.15 గంటలకు అమీర్‌పేట స్టేషన్‌లో జెండా ఊపి మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

గ్రేటర్‌ వాసుల కలల మెట్రో రైలు ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో మొత్తం 17 స్టేషన్లు ఉన్నాయి. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అక్కడ్నుంచి మియాపూర్ దాకా 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలందుతున్నాయి. రోజూ సగటున 75 వేల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు 16 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వస్తుండటంతో నగరంలో మెట్రో ప్రయాణం మొత్తం 46 కిలోమీటర్లకు విస్తరించనుంది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత అతి పొడవైన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డు నెలకొల్పనుంది. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా.. తర్వాత స్థానంలో చెన్నై 35.3 కిలోమీటర్ల దూరం సేవలందిస్తోంది. తాజాగా చెన్నైని హైదరాబాద్ మెట్రో రైల్ వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటికే మెట్రో ప్రయాణం చేస్తున్న వారితో కలిపితే కొత్త మార్గంలో ప్రయాణించేవారి సంఖ్య లక్షన్నరకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

నిత్యం అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ మార్గం రూట్‌ అత్యంత రద్దీగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రయాణికులు నరకం అనుభవిస్తుంటారు. ఇక వర్షం కురిస్తే అంతే సంగతి. అమీర్‌పేట, పంజాగుట్ట, అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట లాంటి రద్దీ ప్రాంతాల మీదుగా మెట్రో రైలు పరుగుపెట్టనుంది. అందుకే ఈ రూట్‌లో మెట్రో కోసం ప్రయాణికులు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇవాళ మెట్రో రైల్‌ అందుబాటులోకి వస్తుండటంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం బారిన పడకుండా వేగంగా గమ్యానికి చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరో 16 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించడంతో.. ఇకపై ఎల్బీనగర్ నుంచి నేరుగా మియాపూర్ దాకా మెట్రోలో ప్రయాణించవచ్చని.. నగరం తూర్పు, పడమరల ఉన్న ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చని ఉద్యోగులు, విద్యార్థులు అంటున్నారు. ఇక అతి త్వరలోనే మూడో కారిడార్‌లో మిగిలిన 8.5 కిలోమీటర్ల మేర అమీర్‌పేట- శిల్పారామం మార్గాన్ని సైతం ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.