అశ్రునయనాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

mla-kidari-sarveswararao-funerals

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి. ప్రభుత్వ లాంచనాలతో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. అంతిమ యాత్ర నుంచి అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. కడసారి తమ అభిమాన నేతలను చూస్తూ.. కన్నీటితో వీడ్కోలు పలికేందుకు కార్యకర్తలు, అభిమానులు, ఏజెన్సీ ప్రజలు భారీగా హాజరయ్యారు. అంతకుముందు భారీ వర్షంలోనే ప్రజా ప్రతినిధుల అంతిమ యాత్ర కొనసాగింది. కిడారి, సోమ అమర్‌ రహే అంటూ మన్యం మార్మోగింది..

కిడారి, సోమల అంత్యక్రియల్లో జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు పాల్గొన్నారు. అధికారుల సూచనతో ప్రత్యేక చాపర్‌లో అరుకు చేరుకున్న మంత్రులు.. మొదట ప్రజా ప్రతినిధుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. తరువాత వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలోనూ, అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. అంతకుముదు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతదేహాలకు శవపరీక్ష పూర్తిచేశారు. కిడారి మృతదేహాన్ని పాడేరుకు, సోమ మృతదేహాన్ని భట్టివలసకు తరలించారు. వీరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

మరోవైపు ప్రజా ప్రతినిధుల హత్యతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడ పడుతున్నాయి. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారంటూ డుంబ్రిగూడ ఎస్‌ఐ అమ్మన్‌రావును డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్‌ ఏర్పాటుచేశారు. ప్రజా ప్రతినిధుల హత్య, తరువాత బంద్‌ కారణంగా విశాఖ మన్యం మూగబోయింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకు లోయ కళ తప్పింది. కన్నీటి సంద్రమైంది. బంద్‌ కారణంగా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.