కిడారి, సోమ హత్య కేసులో కొత్త కోణం … హత్య వెనుక …

విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో హైఅలర్ట్‌ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. మరోవైపు మావోయిస్టుల జాడ కోసం గ్రేహౌండ్స్‌ కూంబింగ్‌ ముమ్మరం చేసింది. ఇద్దరు నేతల హత్య వెనుక రాజకీయ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు కిరాతకంగా హత్య చేయడంతో ఏజెన్సీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి హైఅలర్ట్‌ ప్రకటించారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. 8 గ్రేహౌండ్స్‌ దళాలతో ఏజెన్సీలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

మరోవైపు రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఏజెన్సీ నిర్మానుష్యంగా మారింది. అరకులో ఆందోళనల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు సైతం ఏజెన్సీకి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డయి. దీంతో ఏజెన్సీలో బంద్‌ వాతావరణం కనిపిస్తుంది.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చల పేరుతో వీరిని ట్రాప్‌ చేశారా? స్థానికులు ఎవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతమంది మహిళలు రావడానికి కారణమేంటి? స్థానిక పోలీసుల వైఫల్యం ఎంతమేరకు ఉంది? ఇలా అన్ని కోణాలపై పోలీసులు దృష్టి సారించారు.

ఘటనపై విశాఖపట్నం డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించారు. హత్యకు ముందు కిడారి సర్వేశ్వరరావు, సోమ ఎవరెవరితో మాట్లాడారు? వారికి ఫోను చేసిన వ్యక్తులెవరు? అనే కోణంలో ఆ ఇద్దరి సెల్‌ నెంబర్ల కాల్‌ డేటాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమ హత్యకు సంబంధించి ముగ్గురు మావోయిస్టుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్షుల్ని ప్రశ్నించిన పోలీసులు.. వారు ఇచ్చిన సమాచారంతో వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం జరిగిన దాడిలో అరుణ అలియాస్‌ చైతన్య, స్వరూప అలియాస్‌ కామేశ్వరి, జలుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఇద్దరు నేతల హత్య వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.