మార్కెట్ల యూటర్న్‌- రిలీఫ్‌ ర్యాలీ!


ఉన్నట్టుండి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్లు జంప్‌చేసి 36,555కు చేరింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు ఎగసి 11,029 వద్ద ట్రేడవుతోంది. తొలుత వరుసగా మూడో రోజు అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 165 పాయింట్లు క్షీణించి 36,140కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు నీరసించి 10,904ను తాకింది. కాగా.. సోమవారం నుంచీ అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకి రావడంతో ఇన్వెస్టర్లలో వాణిజ్య వివాద ఆందోళనలు కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో సోమవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా మూడు రోజులపాటు అమ్మకాలు వెల్లువెత్తడంతో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌కు దిగినట్లు వివరించారు.

జోరుగా.. 
ఎన్‌ఎస్ఈలో రియల్టీ మాత్రమే(0.4 శాతం) నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ఫార్మా అత్యధికంగా  2.5 శాతం జంప్‌చేయగా.. బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, ఐటీ రంగాలు 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌, టైటన్‌, లుపిన్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, ఏషియన్‌ పెయింట్స్‌ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐబీ హౌసింగ్‌ దాదాపు 6 శాతం పతనంకాగా.. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌ 3.3-1 శాతం మధ్య నీరసించాయి.

దివాన్‌ హౌసింగ్‌ డౌన్‌
డెరివేటివ్స్‌లో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎన్‌బీసీసీ, అరబిందో, బలరామ్‌పూర్, ఎంసీఎక్స్‌, వొకార్డ్‌, అపోలో హాస్పిటల్స్‌, మదర్‌సన్ సుమీ 6-3 శాతం జంప్‌ చేశాయి. మరోపక్క దివాన్‌ హౌసింగ్‌ 20 శాతం కుప్పకూలగా.. కేన్‌ఫిన్‌, అరవింద్‌, పీటీసీ, ఐడియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండియన్‌ బ్యాంక్‌  6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు ప్లస్‌
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ జోరందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1130 నష్టపోగా.. 1127 లాభాలతో కదులుతున్నాయి.