టీవీ5 ఎక్స్‌క్లూజివ్: ఎమ్మెల్యే కిడారిని నక్సల్స్ చుట్టుముట్టిన దృశ్యాలు

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు కారును మావోయిస్టులు చుట్టుముట్టిన దృశ్యాలను టీవీ5 సంపాదించింది. అరకు నుంచి ఆయన డుంబ్రిగూడ మండలంలోని పలుచోట్ల గ్రామదర్శినిలో పాల్గొనేందుకు వెళ్తుండగా లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు కారును అడ్డగించారు. మెరుపువేగంతో వాహనాన్ని చుట్టుముట్టి ఆయన్ను దించేసి పక్కనే ఉన్న చెట్ల వద్దకు తీసుకెళ్లారు. చర్చల పేరుతో కాసేపు మాట్లాడినా.. నక్సల్స్ చివరికి తాము అనుకున్నట్టే కిడారిని కాల్చి చంపారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను రౌండప్ చేసినప్పుడు.. 20 మంది వరకూ మావోయిస్టులు రోడ్డుపైకి వచ్చారు. మిగతా వాళ్లంతా చుట్టుపక్కల పొదల్లో ఎటాక్‌కి మాటు వేసి సిద్ధంగా ఉన్నారు. ప్రతిఘటన ఎదురైతే దాడి చేసేందుకు వీలుగా అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని.. లివిటిపుట్టు దగ్గర్లో ఈ స్కెచ్ వేశారు. ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లతో ఉన్న ముఠా సభ్యులంతా తుపాకులతో ఎటాక్ చేసి ఎమ్మెల్యేను బందీని చేసుకున్నారు. ప్రస్తుతం చూస్తున్న దృశ్యంలో కొంత మంది మాత్రమే కనిపిస్తున్నా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మాటువేసే ఉన్నారు. చాలా పకడ్బందీగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సివారి సోమను హత్య చేశారు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య జరిగిన ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు పరిగెడుతూ ఉన్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఐతే.. వాళ్లు మావోయిస్టులు కాదని స్థానికులని చెప్తున్నారు. ఈ హత్యలు జరిగిన రోజు.. హుకుంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు డుంబ్రిగుడలోని మీ సేవ కేంద్రానికి వెళ్లారు. వాళ్లు తిరిగి వెళ్తుండగా కాల్పుల ఘటన జరిగినట్టు తెలియడంతో.. ఆ ముగ్గురూ డెడ్‌బాడీలను చూసేందుకు దగ్గరకు వెళ్లారు. స్వామి, బాస్కర్, మహేష్ అనే ఈ ముగ్గురు స్థానికులేనని వీరికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. అలాగే ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళకు కూడా నక్సల్స్‌తో సంబంధాలు లేవని చెప్తున్నారు. ఘటన జరిగిన కాసేపటికి అక్కడకు చేరుకున్న కొందరు ఈ దృశ్యాల్ని తీయడంతో.. వీరు కూడా మావోయిస్టులతో కలిసి ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు అనుమానం కలిగిందంటున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు డ్రైవర్ రవి కూడా, ఇక్కడ సాధరణ దుస్తుల్లో ఉన్న వారికి హత్యలతో సంబధం లేదని టీవీ5కి చెప్పాడు. ఎటాక్ చేయడానికి వచ్చిన వాళ్లంతా ఆలివ్ డ్రెస్ యూనిఫాంలోనే ఉన్నారని వివరించాడు. వాళ్ల చేతుల్లో తుపాకులు, కిట్‌బ్యాగ్‌లు ఉన్నాయంటున్నాడు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు డెడ్‌బాడీకి కొన్ని మీటర్ల దూరంలో మాజీ ఎమ్మెల్యే సివారి సోమ డెడ్‌బాడీలు ఉన్నాయి. ముందు సోమ మృత దేహాన్ని చూసిన వారు.. కొద్ది దూరంలో మరో డెడ్‌బాడీ కూడా ఉందని తెలిసి అటు పరిగెట్టారు. ఆ దృశ్యాలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎటాక్ చేయడానికి వచ్చిన వాళ్లంతా యూనిఫాంలోనే ఉన్నారని ఎమ్మెల్యే డ్రైవర్ రవి టీవీ5కి చెప్పారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.