ఎన్నికల్లో నేరస్తుల పోటీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు దోషులుగా తేలక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సుప్రీం సంచలన తీర్పు ప్రకటించింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయడం కుదరదని స్పష్టం చేసింది. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చో లేదో అన్న విషయాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది.

రాజకీయ నాయకుడిపై అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు బీజేపీ నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరిచింది.

క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో న్యాయస్థానం లేదని అభిప్రాయపడింది. ఈ విషయంలో లక్ష్మణరేఖ దాటలేమని స్పష్టం చేసింది. అయితే నేరస్థులను చట్టసభలకు దూరంగా ఉంచే సమయం వచ్చిందని, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్లమెంట్‌కే వదిలేస్తున్నామని సుప్రీం సూచించింది. దీనిపై పార్లమెంట్‌ ఓ చట్టం తీసుకురావాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రస్తుతం భారత దేశంలో ఎన్నికలను డబ్బు, మదబలం శాసిస్తున్నాయని సుప్రీం వ్యాఖ్యనించింది. రాజకీయాల్లో నేర చరితులు ఉండడం ఒక ఆస్తిగా నేతలు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ధర్మాసనం.. తాజా సుప్రీం తీర్పుతో వివిధ రాజకీయా పార్టీలకు చెందిన నేతలకు ఊరట లభించనుంది. ముఖ్యంగా 2 జీ స్కాం, బొక్కు స్కాంల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేతలకు ఈ తీర్పు ఊరటనిస్తోంది