అమెరికాలో పెరుగుతున్న తెలుగు బలం…మూడోస్థానంలో తెలుగు ప్రజలు

పశ్చిమాన తెలుగు రాగాలు వినిపిస్తున్నాయి.. అగ్రరాజ్యంలో తెలుగు భాషకు బలం పెరుగుతోంది.. ఒక్క తెలుగు మాత్రమే కాదు, దక్షిణాది భాషలు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు బలం పెరుగుతోంది. తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ప్రవాసీయుల్లో తెలుగు మాట్లాడే ప్రజలు మూడోస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో హిందీ మాట్లాడేవారు మొదటి స్థానంలో నిలువగా.. గుజరాతీలు రెండో స్థానంలో ఉన్నారు. 2010-2017 మధ్య తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య ఏకంగా 86 శాతం పెరగడం విశేషం.

ద సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సంస్థ ఆ దేశంలోని ప్రవాసీయులు ఏయే భాషలను ఎక్కువగా మాట్లాడుతున్నారో వివరాలు సేకరించింది. 2017 జూలై 1వ తేదీ నాటికి ఆ దేశ జనాభా ఆధారంగా విశ్లేషించి అమెరికన్ కమ్యూనిటీ సర్వేను విడుదల చేసింది. ఇంగ్లిష్ కాకుండా ఎక్కువ మంది మాట్లాడుతున్న టాప్-5 భాషల జాబితాలో మన తెలుగు భాష ఉంటం విశేషం.

2017 లెక్కల ప్రకారం అమెరికా మొత్తం జనాభా 30.5 కోట్లు. ఇందులో 6.7 కోట్ల మంది ఇతర భాషలు మాట్లాడుతున్నవారేనని సర్వే వెల్లడించింది. ఇందులో హిందీ మాట్లాడేవారు మొదటిస్థానంలో ఉన్నారు. 2016లో అమెరికా జనాభా 30.3 కోట్లు కాగా 6.5 కోట్ల మంది ఇతర భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అంటే ఏడాదిలోనే దాదాపు 1.2 శాతం మంది పెరిగారు. సర్వే నివేదిక ప్రకారం అమెరికాలో హిందీ మాట్లాడేవారు 8.63 లక్షల మంది కాగా.. గుజరాతీ మాట్లాడేవారు 4.34 లక్షల మంది ఉన్నారు. 4.15 లక్షల మంది తెలుగు మాట్లాడుతున్నారు. మొత్తంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో 33 శాతం మంది హిందీ మాట్లాడుతుండగా, గుజరాతీ, తెలుగు మాట్లాడేవారు చెరో 17 శాతం ఉన్నారు. 2010తో పోల్చితే 2017 నాటికి తెలుగు మాట్లాడే ప్రజలు ఏకంగా 86 శాతం పెరిగారు. ఇదే సమయంలో హిందీ మాట్లాడేవారు 42 శాతం పెరుగగా, గుజరాతీయులు 22 శాతమే పెరిగారు. తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికంగా పెరగడానికి కారణం.. సాంకేతిక రంగంలో ఉద్యోగులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అమెరికాకు భారీగా తరలడమేనని కొందరు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు.

2008-2012 మధ్య 26 వేల మంది యూఎస్‌కు వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథమెటిక్స్ విభాగాలలో డిగ్రీలను కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ ఇద్దరూ హైదరాబాద్ నుండే అమెరికా వెళ్లి అత్యున్నత పదవుల్లో స్థిరపడ్డారు. 2013లో మిస్ అమెరికా కిరీటాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ అయిన నీనా దావులూరి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మూలాలు కలిగి ఉన్నారు.

మన భాషలు మాట్లాడే వారి సంఖ్య ఎంతగా పెరిగిపోయిందో అంతే స్థాయిలో జాత్యహంకార దాడులూ పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో తెలుగు వారిపై అనేక చోట్ల దాడులు జరిగాయి. మరోవైపు సమీకరణ ప్రయత్నాలూ బలంగా ఉన్నాయి. సంస్కృతిని తెలియజేయడానికి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చొరవ చూపుతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.