సిద్ధిపేటలో ఏ ఇంటి ముందు చూసినా ఒకటే బోర్డు… ఏమిటంటే?

సిద్ధిపేటలో ఏ ఇంటి ముందు చూసినా ఒకటే బోర్డు కనిపిస్తోంది.. నో పార్కింగ్‌ కోసం పెట్టిన బోర్డనుకుంటే పొరపాటు పడ్డట్టే.. వేల కొద్దీ బోర్డులు ఉన్నా అందులో మ్యాటర్‌ మాత్రం ఒక్కటే.. ఇంతకూ ఆ బోర్డుల్లో ఏముంది..?

ఇప్పటికే గ్రామాల్లో, పట్టణంలో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. కుల సంఘాలన్నీ హరీష్‌రావుకే ఓటు వేస్తామని తీర్మానం చేస్తున్నాయి. పైగా ఎన్నికల ఖర్చు కోసం ఎదురు డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధిపేట ప్రజలు. మరో అడుగు ముందుకేసి తమ ఇళ్ల ముందు బోర్డులు పెట్టుకున్నారు. చేసిన అభివృద్ధి, సేవ కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజలు అంటున్నారు. ఇతర పార్టీలు వచ్చిన ఓట్లు అడగకుండా ఈ బోర్డులు పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ ఇతర పార్టీల నేతలు గెలుపొందినా హరీష్‌రావు చేసినంత అభివృద్ధి చేయలేరన్నది సిద్ధిపేట ప్రజల నమ్మకం. నిత్యం తమకు అందుబాటులో ఉంటూ కష్టసుఖాలు తెలుసుకునే నేతగా హరీష్‌రావుకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కృతజ్ఞతగా ఏర్పాటు చేసినవే ఈ బోర్డులని చెప్తున్నారు.

మరోవైపు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ములుగు, మర్కూక్‌ మండల కేంద్రాల్లో నిర్వహించిన TRS కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్‌రావుకు… ప్రజలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఎర్రవల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి, అవకాశవాదులకు మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో తేల్చుకోవాలని హరీష్ అన్నారు.

కాళేశ్వరం నీళ్లొస్తే బీడు భూములు సాగుభూములుగా మారతాయని హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే క్వాటర్‌ సీసాలు తప్ప మరేమీ రావని ఎద్దేవా చేశారు.