రోడ్డుపై దారుణం.. మానవత్వం మరిచిన జనం..

అసలు మనం మనుషలమేనా.. మానవత్వం ఉందా.. జాలీ, దయ, కరుణ ఇలాంటి పదాలు మనకు వర్తించవా.. అవి మనసనే మన డిక్షనరీలోంచి ఎప్పుడో తీసేసామా.. మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. కనీసం పక్క ఇంట్లో ఎవరుంటున్నారో కూడా తెలియదు. ఇక రోడ్డు మీద సవాలక్ష ఇన్సిడెంట్లను పట్టించుకునే తీరిక ఎక్కడిది. ఒకవేళ ధైర్యం చేసి ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళదామన్నా ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందో అని భయం ఓ పక్క. అందుకే నాకెందుకొచ్చింది.. నేను సేఫ్‌గా ఉంటే చాలనుకుని అక్కడినుంచి చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు.

నడిరోడ్డుపై జరిగే దారుణాలను ఎవరూ ఆపలేకపోతున్నారు. ఒకప్పుడు ఎవరూ చూడని ప్రదేశానికి తీసుకెళ్లి కత్తులతో ప్రత్యర్థిపై వేటు వేస్తుంటే.. ఇప్పడు పట్టపగలే అందరూ చూస్తుండగా అది కూడా రద్దీ ప్రదేశాల్లో ఏమాత్రం జంకు బొంకూ లేకుండా పని కానిచ్చేస్తున్నారు. దీనికి కారణం మమ్మల్ని ఎవరూ అడ్డుకునే వారు లేరన్న ధైర్యం కొంతైతే.. ఒకవేళ అడ్డుకునేందుకు వచ్చినా వారిని కూడా వేసేస్తాం అనే మొండి ధైర్యం కూడా కావచ్చు. జరిగే గొడవలని, దారుణాలని ఆపలేకపోవచ్చు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా సమాచారాన్ని వీలైనంత త్వరగా పోలీసులకు, సంబంధిత అధికారులకు చేరవేయవలసిన బాధ్యత ఉంది.

వారు వచ్చే లోపు అక్కడ ఉన్న నలుగురినీ సమీకరించి దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా నలుగురు కలిస్తే దుండగులు కూడా కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది.

నాకేమవుతుందో అన్న భయాన్ని పక్కన పెట్టి నేనేమైనా చేయగలనా అని ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు మీతో కలిసి నడవడానికి వస్తాయి. రోజూ వాట్సప్‌లో వచ్చే మంచి మెసేజ్‌లను మరో నలుగురికి ఫార్వార్డ్ చేస్తుంటాం. అలాగే ఓ మంచి ప్రయత్నానికి మనమూ శ్రీకారం చుడదాం. మార్పు మనతోనే ప్రారంభిద్ధాం.