విశాఖ మన్యంలో మళ్లీ అలజడి.. మావోయిస్టుల భారీ బహిరంగసభ..

all-about-maoist-new-chief-nambala-keshava-rao

అరకులో ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపి పోలీసులకు సవాల్ విసిరిన మావోయిస్టులు… విశాఖ మన్యంలో మళ్లీ అలజడి సృష్టిస్తున్నారు. ఏవోబీలో మావోయిస్టులు భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో దాదాపు 2 వేలమంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌కు మావోయిస్టు అగ్రనేత ఆర్కేతో పాటు పలువురు కీలక నేతలు హాజరైనట్లు సమాచారం.

చాలాకాలంగా బలిమెల జలాశయంపై నిర్మించిన గురుప్రియ వంతెన వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. ఈ వంతెనతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని… పెట్టుబడిదారులకు పారిశ్రామిక అవసరాల కోసం నిర్మించారని గిరిజనులతో పాటు మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ జలాశయం దిగువ వందలాది ఎకరాల సారవంతమైన భూములను గిరిజనులు సాగుచేస్తున్నారు. జలాశయం నీటిమట్టాలు పెరిగినప్పుడు పంటలు మునిగిపోవడంతో జనం చనిపోతున్నారని మావోయిస్టులు మండిపడుతున్నారు. దీంతో బలిమెల రిజర్వాయర్‌లో నీటిమట్టాలు తగ్గించాలని… లేకపోతే తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు. నీటి మట్టం తగ్గించకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో ఏడు పంచాయతీలకు చెందిన గిరిజనులు పాల్గొనట్టు సమాచారం. ఓవైపు ఏవోబీలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు సభ నిర్వహించడం కలకలం రేపింది.


అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్య తర్వాత… ఏవోబీలో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఒడిశా పోలీసుల సహకారంతో వేట కొనసాగిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధుల హత్య తర్వాత… మావోయిస్టులకు గట్టి పట్టున్న గ్రామాలపై ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు దృష్టి పెట్టాయి. రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు తలదాచుకున్నారని తెలిసి.. అక్కడున్న ఓ గ్రామాన్ని బలగాలు చుట్టుముట్టాయి. అయితే భౌగోళిక సరిహద్దులు తెలియకపోవడంతో భద్రతా దళాల కళ్లుగప్పి మావోయిస్టులు మూడుసార్లు తప్పించుకున్నట్లు సమాచారం.

మరోవైపు ఇవాళ ఒడిశాలో మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ అధికారులు సమావేశమై… యూనిఫైడ్ కమాండ్‌తో వేట కొనసాగించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉమ్మడి నిఘా కోసం చర్చించనున్నట్లు సమాచారం. అలాగే మావోయిస్టుల సమాచారాన్నిఇచ్చిపుచ్చుకునే అంశంపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలిసింది.