ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ క్షణం ఆలోచించి..

తల్లిదండ్రులు బిడ్డ భారాన్ని దించుకోవాలనుకున్నారు. బాధ్యత అనుకుని పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. 14 ఏళ్ల ఆ అమ్మాయి ఆ వయసుకే అన్నీ చూసింది. కట్నం కోసం అత్తింటి ఆరళ్లు. కట్టుకున్న భర్త కొట్టే దెబ్బలు, ఆడపడుచుల వేధింపులు. జీవితమంతా ఇలానే బ్రతకడం కంటే చావడం మేలనుకుంది. అనుకున్నదే తడవుగా రోడ్డు మీదకి పరిగెట్టింది. స్పీడుగా వస్తున్న బస్సుకి అడ్డంగా వెళ్లింది.

అంతలోనే అంతరాత్మ వద్దంటూ వారించింది. చచ్చి ఏం సాధిస్తావు. బ్రతికి నువ్వేంటో లోకానికి తెలియజేయి అని మనసు హెచ్చరించింది. దాంతో ఒక్కఉదుటన పక్కకి తప్పుకుంది. ఎలాగైనా బ్రతకాలనుకుంది. ఒంటిమీద కట్టుబట్టలు తప్ప చేతిలో చిల్లి గవ్వలేదు. ఏదైనా పనుంటే చెప్పండి చేస్తానంటూ ఓ హోటల్‌కి వెళ్లింది. అక్కడ పనితోపాటు తినేసేలా ఉన్న వారి చూపుల్ని భరించలేకపోయింది. లోకం పోకడ తెలిసి జాగ్రత్తగా మసలుకుంది. ఓ రోజు ఇలాగే పనిలోకి వెళుతుంటే రయ్ మంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న మహిళను చూసింది. పక్కన ఉన్న స్నేహితురాలిని అడిగింది. మహిళలు కూడా డ్రైవ్ చేస్తారా అని.. ఎందుకు చేయరు డ్రైవింగ్ నేర్పించే స్కూళ్లు ఉంటాయి. అక్కడ ఎవరికైనా నేర్పిస్తారు అని చెప్పింది ఆమె. మరుసటి రోజు డ్రైవింగ్ స్కూల్‌కి తానూ నేర్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అక్కడ 5 వేలు కట్టి జాయిన్ అవ్వమన్నారు.

తాను అప్పటివరకు పనిచేసి దాచుకున్న డబ్బు మొత్తం తీసుకువచ్చి ఇచ్చింది. శ్రద్ధగా డ్రైవింగ్‌లోని మెళకువలన్నీ నేర్చుకుంది. స్టీరింగ్ పట్టిన వారం రోజుల్లోనే రోడ్డు మీద దూసుకువెళ్లింది. కారుతో పాటు ట్రక్, లారీ డ్రైవింగ్‌ కూడా నేర్చుకుంది. కర్ణాటక రాష్ట్రంలోనే తొలి మహిళా టాక్సీ డ్రైవర్‌గా, తొలి లారీ డ్రైవర్‌గా, తొలి ట్రక్ డ్రైవర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన సెల్వీ తనకు నచ్చిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు బిడ్డలకు తల్లైంది. ఇప్పుడు తన బిడ్డలతో పాటు మరెందరికో సెల్వీ రోల్ మోడల్‌గా నిలిచింది.