‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ

aravinda-sametha-veera-raghava-telugu-movie-review

– కుమార్ శ్రీరామనేని
కొన్ని కాంబినేషన్స్ మీద ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ క్రియేట్ అవుతుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మీద అలాంటి క్రేజ్ నే క్రియేట్ చేసింది. యంగ్ టైగర్ అండ్ త్రివిక్రమ్ కలసి చేసిన ప్రయాణం అరవింద సమేత వీర రాఘవ . ఈ క్రేజీ ఫిల్మ్ ఎలా ఉందో చూద్దాం..

కథ:
బసిరెడ్డి( జగపతిబాబు),నారపరెడ్డి( నాగబాబు) కుమద్య చిన్న గొడవ ఫ్యాక్షన్ కు దారి తీస్తుంది. ఆ గోడవ రెండు కుటుంబాలలో ప్రాణాలను తీస్తుంది. రెండు ఊళ్ళను ఫ్యాక్షన్ చిచ్చులో పడివేస్తుంది. నారపరెడ్డి కొడుకు వీర రాఘవ ( ఎన్టీఆర్)ఆ ప్యాక్షన్ కే తన తండ్రి ని కోల్పోతాడు. ఇంకా పగలు వేడిగా ఉండగానే ఆ ప్రాంతం నుండి బయటకి వస్తాడు. వీరరాఘవ కోసం ఆ ఊరి ప్రజలు ఎదురు చూస్తుంటారు. పగవాళ్ళు వెతుకుతుంటారు. ఆ క్రమంలో పరిచయం అయిన అరవింద( పూజా హెగ్డే) వీర రాఘవ ఆలోచనలను కొత్త దారిలో పడేలా చేస్తుంది. గొడవలో గెలవడం కాదు గొడవలను ఆపడం గొప్ప అని తెలుసుకున్న వీరరాఘవ ఆ ప్రాంతంలో పగలు చల్లార్చడానికి ఏం చేసాడు..? అనేది మిగిలిన కథ..

కథనం:
ప్యాక్షన్ కి హీరోయిజం జోడించిన కథలను చూసిన ప్రేక్షకులకు ప్యాక్షన్ వెనక ఉన్న అసలు కథలను నిజాయితీగా తెరమీదకు తీసుకువచ్చాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కథలను ఇలానే మొదలు పెట్టాలి. ఇక్కడ లేపాలి.. అక్కడ నవ్వించాలి.. ఇక్కడ ఏడిపించాలి అనే లెక్కలు వేసుకోకుండా తన నమ్మిన పాయింట్ ని అనుకున్నట్లుగా చెప్పడంలో పూర్తి విజయం సాధించాడు. సినిమా మొదలైన నిముషాల లోపే వచ్చే ఫైట్ సీన్ సాధారణంగా ఇంటర్వెల్ కి వస్తుంది. కానీ త్రివిక్రమ్ ఆ భయాలనుపూర్తిగా వదిలేసాడు. అందుకే అరవింద సమేత ఒక గంభీరమైన వాతావరణంలో ప్రేక్షకుల్ని తొలి పది నిముషాల్లోనే కూర్చోబెడుతుంది. ఇంట్లో ఆడవాళ్ళకు ఏదీ చెప్పం.. ఏదైనా చేసే ముందు ఏదీ అడగం .. కానీ వాళ్లతో మాట్లాడితే ఆ మార్పు ఎంత గొప్పగా ఉంటుందో వీర రాఘవ కథ చెబుతుంది. త్రివిక్రమ్ సినిమాలలో కెల్లా చాలా బలమైన వ్యక్తిత్వం కల ఆడపాత్రలు అరవింద సమేత లో కనిపిస్తాయి. ‘దేవుడు చావులు ఎక్కువ కన్నీళ్ళు తక్కువ’ ఇచ్చాడు లాంటి మాటలు పౌరషంతో మీసాలు తిప్పే ఫ్యాక్షన్ లీడర్స్ ఇంట్లో ఆడవాళ్ల మనసులను చూపిస్తాయి. అక్కడ మొదలైన ప్రయాణం తీసుకునే ప్రతి మలుపు కూడా బాగుంది. ఈ తరం నటులలో ఎన్టీఆర్ గొప్ప నటుడు అనడానికి ‘ అరవింద సమేత వీరరాఘవ’ కూడా ఒక ఉదాహారణగా నిలుస్తుంది. ఆ పాత్రలో అలా ఉండిపోయాడు. ఆ పాత్రను చాలా సహాజంగా తెరమీదకు తెచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీతో కత్తి తో ఉరకలెత్తిన ఎన్టీఆర్ .. తర్వాత అలాంటి సందర్భం వచ్చినప్పుడు కేవలం మాట్లాడతాడు. మొదటి సీన్ లోో ఎంత పవర్ పుల్ గా కనిపిస్తాడు. కాలుమీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలోనూ అంతే పవర్ తో కనిపిస్తాడు. హీరోయిజం అనేది ఒక వేలో చూడటం అలవాటు అయిన వారికి యంగ్ టైగర్ కళ్ళల్లో కనిపించిన తీవ్రత అంతే ఇంపాక్ట్ ని ఇస్తుంది. పూజా హెగ్డే తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో కనిపించిన ప్రతి సన్నివేశంలో కూడా ఆ పాత్ర ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఇక జగపతి బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బసిరెడ్డి పూనాడా అనిపించింది. డబ్బింగ్ నుండి గెటప్ వరకూ ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్న ప్రత్యేక శ్రర్ద కనిపిస్తుంది. తారక్ తో పోటీ పడి నటించాడు. హీరోగా రెండు దశాబ్దాలు మెప్పించిన జగపతేనా అనేంత గా నటించాడు. నవీన్ చంద్ర బసిరెడ్డి కొడుకు పాత్రలో మంచి నటన కనబరిచాడు. ఈషా పాత్ర పర్వాలేదు. సునీల్ నవ్వించడానికి కాకుండా కథలో ఒక పాత్రగా ఉన్నాడు. రెగ్యులర్ కామెడీ ని టచ్ చేయలేదు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలుస్తుంది. ఒక క్లైమాక్స్ తెలుగు సినిమా కథలకు రిఫరెన్స్ లా మారుతుంది. త్రివిక్రమ్ లోని కలం దమ్ము క్లైమాక్స్ లో మాక్స్ సైజ్ లో కనిపించింది. కథలను ముందుకు నడిపించిన తారక్ పై మరింత గౌరవం కలిగింది. వినోద్ సినిమాటోగ్రాఫీ సినిమాకు అదనపు బలంగా మారింది. నిర్మాత చినబాబు ప్రొడక్షన్ విలువలు సినిమాకు మరింత రిచ్ నెస్ ని తెచ్చాయి.

చివరిగా:
దసరా కి పవర్ ప్యాకడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్స్ తో నిండిన అరవింద సమేత బాక్సాఫీస్ బరిలో గెలుస్తుంది. ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ హిట్ ట్రాక్ పై ప్రయాణం మొదలు పెట్టింది.