సీన్ రివర్స్.. మళ్ళీ కాంగ్రెస్ లోకి పద్మినీరెడ్డి.. కారణం ఏంటంటే..

బీజేపీలో చేరిన పద్మినిరెడ్డి.. కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి భార్య పద్మినీరెడ్డి.. ఎన్నికల వేళ వలసలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పారు. ఉదయం కాషాయ కండువా కప్పుకున్న ఆమె.. సాయంత్రానికి మనసు మార్చుకున్నారు. తన భర్త మనోవేదన చూడలేకపోతున్నానంటూ.. సాటి మహిళగా తన అంతరంగం బయటపెట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఆకర్షితులయ్యానని, పార్టీ మారడం తన వ్యక్తిగత నిర్ణయమని పద్మినిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ ఆదేశిస్తే సంగారెడ్డి నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారామె. అయితే.. కొన్ని గంటల్లోనే తన నిర్ణయం మార్చుకున్నారు. బీజేపీకి హ్యాండిచ్చారు. తన భర్త కొనసాగుతున్న కాంగ్రెస్‌లోనే ఉంటానని పద్మినిరెడ్డి స్పష్టంచేశారు.