ఢిఫ‌రెంట్‌గా ఆలోచిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు

cm chandrababunaidu think differently

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిఫ‌రెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పార్టీ అభ్యర్దుల‌పై దృష్టి పెట్టే అధినేత ఈసారి ముందే డిసైడ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాలపై ఫోక‌స్ పెడుతున్నారు చంద్రబాబు. అక్కడ టికెట్ కోసం పార్టీ నుండి ముగ్గురు న‌లుగురు పోటీపడుతుంటంతో వారంద‌రిని కూర్చోబెట్టి మాట్లాడి ఒక‌రిని ఇన్‌ఛార్జ్‌గా నియ‌మిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చివరి నిమిషం వరకూ ఆగి.. పరిస్థితులను బట్టి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారని పేరుంది. కానీ ఇందుకు భిన్నంగా రానున్న ఎన్నికలకు ముందుగానే అభ్యర్ధులపై క్లారిటీ ఇస్తున్నారు. ఇది కేడర్ ను విస్మయ పరుస్తోంది.

ప్రతిరోజూ ఉద‌యం స‌చివాల‌యంలో ప‌రిపాల‌న వ్యవ‌హారాలు చూసే చంద్రబాబు.. సాయంత్రం ఇంటికి రాగానే పూర్తి స్దాయిలో పార్టీపైనే ఫోక‌స్ పెడుతున్నారు. ఇప్ప‌టికే చిత్తూరు జిల్లాలో ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగ‌తా అభ్యర్దులు అంద‌రిని ఖారారు చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌రుగుతున్న స‌మీక్షా స‌మావేశాల్లోనే ఖరారు చేస్తున్నారు. చంద్రగిరికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పుల‌వ‌ర్తి నాని ఇంఛార్జ్ గా నియమించారు. పుంగ‌నూరు బాధ్యతలు అనుషా రెడ్డికి అప్పగించారు. న‌గ‌రి నియోజ‌క ‌వ‌ర్గానికి ఒక‌టి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఇంఛార్జ్‌గా ప్రతాప్ బాంజ్‌దేవ్‌ను ప్రకటించారు. కురుపాంకు మాజీ మంత్రి శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు స‌తీమ‌ణి శ‌శిక‌ళా దేవికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా సంత‌నూత‌ల‌పాడు, చిత్తూరు జిల్లా మద‌న‌ప‌ల్లి నియోజ‌క ‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను త్వరలో ప్రక‌టించ‌నున్నారు. అటు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో లోకేష్ బహిరంగసభల్లో అభ్యర్ధులను ప్రకటించారు. మొత్తానికి అధినేత దూకుడు చూసి పార్టీ నేత‌లే ఆశ్చర్యపోతున్నారు.