కోదండరాం పెట్టిన డెడ్‌లైన్ ముగుస్తుండడంతో..

kodandharam prepare general elections

మ‌హా కూట‌మిలో టీజేఎస్ అల్టిమేటం రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. త‌మకు కేటాయించిన సీట్లను 48 గంట‌ల్లోగా చెప్పకపోతే.. త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని స్పష్టం చేయ‌డంతో… బలబలాలపై చ‌ర్చ సాగుతోంది. అటు.. కోదండరాం పెట్టిన డెడ్‌లైన్ కాసేపట్లో ముగుస్తుండడంతో… కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. కోదండరాం కోరుతున్న 25 సీట్లలో.. గెలుపు అవకాశాలపై హస్తం నేతల్ని అనుమానాలు వెంటాడుతున్నాయి. తమ పార్టీకి చెందిన బలమైన నేతల్ని కాదని టీజేఎస్‌కు అవకాశమిస్తే… చేజేతులారా టీఆర్‌ఎస్‌కు సాయం చేసినట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో మహాకూటమిలో ఉమ్మడి ఎజెండాపై ఏకాభిప్రాయానికి వ‌చ్చిన పార్టీలు… సీట్ల విభజనపై మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి.

మహా కూటమిలోని అన్ని పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల లిస్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. టీజేఎస్‌ సైతం 25 స్థానాలు కావాలని కోరింది. అయితే ఆయా సీట్లలో టీజేఎస్‌కు ఎంత బలముందన్న సందేహాలు కాంగ్రెస్ నేతలను తొలిచేస్తున్నాయి. టీజేఎస్‌లో పెద్దగా ప్రజాకర్షణ ఉన్న నాయకులు లేరని విమర్శిస్తున్నారు. కోదండరామ్‌ ఒక్కడే ఎంతమందిని గెలిపించగలుగుతారని అనుమానిస్తున్నారు. టీజేఎస్‌ కోరినన్ని సీట్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో.. కనీసం అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున ఇవ్వాలని కోదండరామ్‌ అడిగినట్లు సమాచారం. ఈ డిమాండ్‌ పైనా పీసీసీ పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సీట్ల పంపకాలపై టీజేఎస్‌ నుంచి ఒత్తిడి పెరగడంతో.. ఇప్పటికిప్పుడు స్థానాలు ప్రకటించేది లేదని.. నామినేష‌న్‌కు ప‌దిరోజుల ముందు మాత్రమే అభ్యర్థులను వెల్లడిస్తామని తేల్చేశారు. దీంతో కాంగ్రెస్‌కు 48 గంట‌ల డెడ్‌లైన్ పెట్టిన కోదండరామ్.. అప్పటిలోగా సీట్ల విభజనపై క్లారిటీ ఇవ్వాలంటున్నారు. లేకపోతే తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించి… వెంటనే ప్రచారం మొదలు పెడతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ కచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్న స్థానాలనే టీజేఎస్‌ ఆశించడంతో.. సీట్ల పంపకాలపై పీటముడి పడింది. టీజేఎస్‌ తరఫున మిర్యాలగూడ టికెట్‌ను మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ జానారెడ్డి కుమారుడు ర‌ఘువీర్ గ్రౌండ్‌వ‌ర్క్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. టీజేఎస్‌ తరఫున వ‌రంగల్ ఈస్ట్ నుంచి గాదె ఇన్నయ్య పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. మ‌ల్కాజ్‌గిరిలో మాజీ ఎమ్మెల్సీ క‌పిల‌వాయి దిలీప్, సూర్యాపేట నుంచి ధ‌నార్జున్, ఎల్లారెడ్డిలో లాయర్ ర‌చ‌నారెడ్డి, మ‌హ‌బూబాబాద్‌లో అభినంద‌న, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నుంచి చింతాస్వామి, అంబర్‌పేటలో స‌త్యంగౌడ్ పోటీ చేయడానికి రెడీ అయ్యారు. క‌రీంన‌గ‌ర్‌లో కాంట్రాక్టర్‌ జగ్గారెడ్డి టికెట్‌ ఆశిస్తుండగా.. ఇక్కడ్నుంచి పొన్నం ప్రభాకర్‌ను పోటీకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మ‌హ‌బూబ్‌న‌గర్‌లో కోదండ‌రాం స్నేహితుడు రాజేందర్‌రెడ్డికి టికెట్‌ కోరగా.. ఇటీవ‌లే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీం సైతం పోటీ పడుతున్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. ఇబ్రహీంనే బరిలో దించాలని పీసీసీ పెద్దలు భావిస్తున్నారు.

మరోవైపు టీజేఎస్‌ ఆశిస్తున్న కీలక స్థానం సూర్యాపేట. ఇక్కడ్నుంచి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దామోద‌ర్‌రెడ్డిని కాద‌ని… మరో పార్టీకి టికెట్ ఇచ్చే సాహ‌సం చేస్తుందా అన్నది ప్రశ్నార్థకం. ఇక దుబ్బాక స్థానాన్ని మాజీ డిప్యూటీ సీఎం రాజన‌ర్సింహ అనుచ‌రుడు చెర‌కు శ్రీ‌నివాస్‌రెడ్డికి ఇప్పించాల‌ని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయ‌న్ను కాద‌ని జనసమితికి కేటాయించ‌డం కష్టమే. అలాగే జనగామలో పొన్నాలను, పెద్దపల్లిలో విజయరామారావుని కాదని.. వేరే పార్టీకి టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి చిక్కుముళ్లు విడిపోయేదాకా మహా కూటమిలో సీట్ల స‌ర్దుబాటు వ్యవహారం కొలిక్కివ‌చ్చే ప‌రిస్థితి లేదు.

అసలే సీట్ల పంపకాలు తేలక తలనొప్పి ఎదుర్కొంటున్న కోదండరామ్‌కు… టీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలు పుండు మీద కారం చల్లినట్లు మారాయి. కేవలం మూడు స్థానాల కోసం మహా కూటమికి పొర్లుదండాలు పెడుతున్నారంటూ గులాబీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దీంతో క‌నీసం పాతిక సీట్లు సాధించాలని టీజేఎస్‌ నేతలు పట్టుదలగా ఉన్నారు. అది సాధ్యం కాకపోతే తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.