ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబుకు ఊరట

polavaram odisa case updates

ధర్మాబాదు కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేయాలంటూ.. చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ ను అనుమతించింది. ఈనెల 15కు విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం.. వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు మినహాయింపునిచ్చింది.

బాబ్లీ అంశంలో సీఎం చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ రెండ్రోజుల కిందట.. న్యాయవాదులు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుపై జారీ చేసిన వారెంట్ ను వెనక్కి తీసుకోవాలని ఈ పిటిషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించారు. సీఎం కావడంతో వ్యక్తిగత హాజరు సాధ్యం కాదని న్యాయస్థానానికి విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నవంబర్ 3న హాజరు కావాలని అన్నారు. అయితే, అప్పుడు కూడా మినహాయింపునివ్వాలని న్యాయవాదులు కోరారు.

మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. 2010లో చంద్రబాబు పోరాడారు. ఆ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత ధర్మాబాద్ కోర్టు.. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం రీకాల్‌ పిటిషన్‌ వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టులో గురువారం రీకాల్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేసును ఈనెల 15న వాయిదా వేసింది. చంద్రబాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చింది.