ఫిర్యాదుల పరిష్కారంలో కొత్త రికార్డులు

speacial story on real time governance

టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. 2001లో ప్రారంభించిన ప్రభుత్వ పాలన- పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ భాగంగా ఆర్టీజిని ప్రారంభించారు. సెక్రటేరియెట్‌ డిపార్ట్‌మెంట్స్‌- లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌ మధ్య సమన్వయం కోసమే ఆర్టీజి ఏర్పాటు చేశారు. దీనికోసం ఏపీ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఆర్టీజి సొసైటీని రిజిస్టర్‌ చేశారు. ఈ గవర్నెన్స్‌, టెక్నాలజీ, ఈ ప్రగతి- ఈ కమ్యూనికేషన్, ప్రజలే ముందు., పరిష్కార వేదిక.,సోషల్ మీడియాలను అనుసంధాన విభాగాలుగా చేర్చారు. అయితే ఈ వ్యవస్థలు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఆయన స్పందించినంత వేగంగా పనిచేయడం లేదనే విమర్శలున్నాయి..

ఆర్టీజిలో భాగంగా స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు డిస్ట్రిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీజి సొసైటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. ఎనిమిది మంది ఉన్నతాధికారుల్ని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు అందులో ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు ఐటీ శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. కోర్‌ డాటా సీఈఓ, ఈ ప్రగతి సీఈఓ, డీజీపీ, ఏపీ ఫైబర్‌ నెట్ ఎండీ, రెవిన్యూ కమిషనర్ అందులో సభ్యులుగా ఉంటారు. ఈ వ్యవస్థలన్నీ పక్కాగానే ఉన్నా వీటి పనితీరు మెరుగు పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

ప్రభుత్వ శాఖలు, పాలనా వ్యవహారాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ప్రజలకు-పాలనా వస్థకు మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం రియల్‌ టైం గవర్నెన్స్‌ వ్యవస్థను మొదలు పెట్టారు. గోదావరి పుష్కరాల సమయంలో మొదలుపెట్టిన కమాండ్ కంట్రోల్ వ్యవస్థను, ఆ తర్వాత కృష్ణా పుష్కరాల నాటికి మరింత ఆధునీకరించి ప్రభుత్వ శాఖలను అనుసంధానించారు..

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ పక్కనే ఓ విశాలమైన ప్రాంగణం ఉంది. అందులో 60నుంచి 70 కంప్యూటర్లను అమర్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఎం జరిగినా క్షణాల్లో తెలుసుకునే యంత్రాంగం ఉంది. అందులో బయటివాళ్లెవరూ అడుగుపెట్టకుండా కట్టుదిట్టమైన భద్రతా ఉంది. ఇదే ముఖ్యమంత్రి డ్రీం ప్రాజెక్ట్ రియల్ టైం గవర్నెన్స్. ఇంత హడావుడి కనిపించినా దీని పనితీరు ఇంకా మెరుగు పడితే తప్ప సీఎం అంచనాలను అందుకోదనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

పాలనలో ప్రజలే ముందు. ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం. సీఎం ఆదేశించడమే ఆలస్యం క్షణాల్లో కావల్సిన నివేదికలు ఆయన టేబుల్‌పై ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ నివేదికల్లో అధికారులు పారదర్శకత ప్రదర్శించడం లేదనే విమర్శలున్నాయి. సీఎం ఆగ్రహానికి గురికావల్సి వస్తుందేమోననే భయంతో అధికారులు క్షేత్ర స్థాయిలో జరిగే విషయాలను సరిగా వివరించడం లేదనే విమర్శలున్నాయి..

స్టేట్ ఆఫ్ ఆర్ట్‌ ఆఫీసులు, అత్యాధునిక టెక్నాలజీ, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం సొంతం. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఎవరైనా చంద్రబాబు తర్వాతే. ఎటొచ్చీ టెక్నాలజీతో పనిచేయించే వ్యక్తుల్లోనే లోపం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టేంచేలా అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఆక్షేపణలున్నాయి..

ఈ ప్రాజెక్టు లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రజా పరిష్కార వేదిక 1100, ప్రజా సమస్యల పరిష్కారం, ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ప్రజల సమస్యలు గుర్తించాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేయాలి. పాలన అంచెల్లో జాప్యాన్ని నిరోధించి సత్వర సేవలు అందించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ ప్రాజెక్టు లక్ష్యాలే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు. కమాండ్‌ కంట్రోల్, ప్రజా పరిష్కార వేదిక, రియల్ టైం గవర్నెన్స్… ఇలాంటివన్నీ మలి విడత ఈ గవర్నెన్స్‌లో భాగంగా హైటెక్‌ సంస్కరణలను అమరావతిలో ప్రారంభించారు. వీటికి వందల కోట్ల రుపాయలను కేటాయించారు..

పాలనలో సంక్షేమం, సంస్కరణల అమలు, బాధ్యులపై చర్యలు తీసుకోవడం… ఇలా దేశంలో ఎక్కడలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనకు చేర్చి రియల్‌ టైం గవర్నెన్స్‌ వ్యవస్థను తీర్చిదిద్దినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వ్యవస్థ పనితీరులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఘటననే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఆకస్మిక వరదలు రానున్నాయంటూ పోలవరం విలీన మండలాల ప్రజలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ మెసేజ్‌లు వెళ్లాయి. అవే మెసేజ్‌లు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అందాయి. అయితే కేవలం ఆధార్ డేటా బేస్‌ ఆధారంగా వాటికి లింక్ అయి ఉన్న మెసేజ్‌లు వెళ్ళిపోయాయి. దీంతో స్థానికులు నిద్ర లేకుండా గడిపితే, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ వారెలా ఉన్నారో తెలియక టెన్షన్‌ పడ్డారు..

రియల్ టైం గవర్నెన్స్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు చేర్చారు. వాటిని జీఏడికి అనుసంధానించి అయా శాఖలలో జరుగుతున్న పనులను పరిశీలించడం మొదలుపెట్టారు. ఇది సహజంగానే మిగిలిన శాఖలకు ఆగ్రహం తెప్పించింది. దీంతో చాలా శాఖలు సహాయ నిరాకరణ మొదలుపెట్టాయి. సంతృప్తికర స్థాయి పౌర సేవలు సాధించాలని టార్గెట్ పెట్టడంతో… తమపై ఆర్టీజి పెత్తనం ఏమిటని చాలా శాఖలు అభ్యంతరం చెప్తున్నాయి. ఇదే ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నట్లు భావిస్తున్నారు.

రోజుకు పదిలక్షల ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించి, ఫిర్యాదుల పరిష్కారంలో కొత్త రికార్డులు సృష్టించారు. ప్రారంభించిన ఏడాదిలో 40కోట్ల ఫోన్‌ కాల్స్‌ అనేది రియల్‌ టైం గవర్నెన్స్ వ్యవస్థ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. వందల మంది ఉద్యోగులు, 24 గంటలు పనిచేసే యంత్రాంగం ఉన్నాయి. ప్రజా పరిష్కార వేదికలో ఇంటరాక్టివ్‌ వాయిస్ సిస్టం ద్వారా రోజుకు 15 లక్షల కాల్స్ చేసే సామర్ధ్యముంది. ఈ కాల్స్‌లో ఎక్కువ భాగం జనం వినకుండానే కాల్‌ కట్‌ చేసేస్తుంటారు. ఇక 1100 కాల్‌ సెంటర్‌కు గత ఏడాది 16 లక్షల 33 వేల ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా శాఖలకు పంపి పరిష్కరించే బాధ్యత ఆర్టీజిది. ఇక్కడే లోపం ఉన్నట్లు భావిస్తున్నారు. దాన్ని సరిదిద్దితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం ఉంది..

ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధి పనులు ఇలా వేటినైనా ఆర్టీజి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఆచరణలో మాత్రం కొన్ని లోపాలున్నాయి. అధికారులు కొందరు కాలక్షేపం చేసి ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి విషయాల్లో పత్రికల్లో కథనాలు వస్తే వాటిపై హడావుడి చేసి తామే పరిష్కరించామని చెప్పుకోవడానికి కొన్ని శాఖలు పరిమితం అవుతున్నట్లు విమర్శలున్నాయి. వాతావరణ సమాచారం, వర్షపాతం వివరాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్ని మాకు ముందే తెలుస్తాయని ఆర్టీజి బాధ్యులు చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి భారత వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని కూడా సకాలంలో ఆర్టీజి ఇవ్వలేకపోతోంది. శాటిలైట్ చిత్రాలతో సహా వర్షపాతం వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఎప్పుడైనా వర్షాలు కురిసినపుడు మినహా మిగిలిన సందర్భాల్లో ఆర్టీజి ఏం చేస్తుందో ఎవరికి తెలియడం లేదనే విమర్శలు వస్తున్నాయి..

ఇటీవల కొన్ని నివేదికలలో 82శాతానికి పైగా సంతృప్తి వ్యక్తమైనట్లు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చారు. వాటిని సీఎం ప్రముఖంగా ప్రస్తావించారు. ఆర్టీజి నివేదికలపై ఆధారపడితే అంతే సంగతులని మంత్రులే వ్యాఖ్యనిస్తున్నారంటే దాని పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఆడింది ఆటగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. ఇకనైనా ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్ వ్యవస్థ తనలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ అంచనాలను అందుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.