తిత్లీ బీభత్సం..

thithly cyclone effect in srikakulam

తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. భీకర గాలుల ధాటికి లక్షల ఎకరాల్లో కొబ్బరి, జీడిమామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ఎటు చూసిన నెలకొరిగిన చెట్లు, కూలిన ఇళ్లు, కొట్టుకుపోయిన రహదారులతో అపారనష్టాన్ని మిగిల్చాయి. పలాస రైల్వే స్టేషన్ సైతం ధ్వంసమైంది. తిత్లీ అలజడికి 8మంది ప్రాణాలు కోల్పోయారు.

శ్రీకాకుళం జిల్లా వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు బాధిత ప్రజలను పరామర్శించారు. నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి.. అనంతరం కేత్రస్థాయిలో పర్యటించారు. పలాస, కాశీబుగ్గల్లో పరిస్థితిని పరిశీలించారు. పలాస రైల్వేస్టేషన్, బస్టాండ ప్రాంతాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటించారు.

అనంతరం వజ్రపు కొత్తూరు మండలం గరుడభద్ర, అక్కుపల్లి గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు.. నీట మునిగిన జీడిపంటలను పరిశీలించారు. తిత్లీ బీభత్సంతో ఏర్పడిన భారీ నష్టాన్ని పూరిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన వారికి పక్కా ఇండ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు..

తుఫాను మిగిల్చిన నష్టం, వరద పరిస్థితిపై పలాస మున్సిపల్ ఆఫీసులో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధల్లో ఉన్నప్పుడే ప్రజలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. సేవాకార్యక్రమాల్లో ముందున్న వారికి అవార్డులతో సత్కరిస్తామని చెప్పారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా.. తన పర్యటనలో ఎవ్వరూ పాల్గొనవద్దని, వరద బాధితులకు సాయం చేయడంపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు చంద్రబాబు.

అటు విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సుజయకృష్ణ రంగారావు పర్యటించారు. గరుగుబిల్లి , జియ్యమ్మవలస మండలాల్లోని గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుఫాను వల్ల జిల్లాలో చెరకు, అరటి, మొక్కజొన్న, పత్తి పంట నష్టం అధికంగా జరిగిందన్నారు. ప్రభుత్వం అన్నివిధాల రైతులను అదుకుంటుందని హామీ ఇచ్చారు. తుఫాన్‌తో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర సాధారణ స్థితికి వచ్చేదాకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు శ్రీకాకుళం రావాలని సీఎం ఆదేశించారు.