తనతో ఓ రాత్రి గడిపితే సూపర్‌స్టార్‌ను చేస్తానని..భూషణ్‌ కుమార్‌ వేధించాడంటూ..

లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎట్టకేలకు కేందమంత్రి ఎంజే అక్బర్‌ స్పందించారు. కొందరు కట్టుకథలతో ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. తనపై ఎన్నికల ముందు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్ఠకు భంగం కల్గించేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అక్బర్‌ హెచ్చరించారు.

దేశాన్ని ఊపేస్తున్న మీ టూ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఏకంగా కేంద్రమంత్రి అక్బర్‌పై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రధాని మౌనాన్నే ఆశ్రయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.

బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌పై.. నటి తనుశ్రీదత్తా చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం తారస్థాయికి చేరింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపైనా లైంగికదాడి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేపింది. కేంద్రమంత్రి కాకముందు జర్నలిస్టుగా పనిచేశారు ఎంజే అక్బర్. అక్బర్ తన కెరీర్‌లో టెలీగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ద సండే గార్డియన్‌లాంటి ప్రముఖ పత్రికల ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తనను వేధించారంటూ తొలిసారి ప్రియారమణి అనే జర్నలిస్ట్ బయటపెట్టింది. ఆ తర్వాత పలువురు మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు.

ఇక.. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ నైజీరియాలో అధికారిక పర్యటన ముగించుకుని ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేశారని… తన రాజీనామా లేఖను ఈ-మెయిల్ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారని వార్తలు వచ్చాయి. అయితే అక్బర్‌ రాజీనామా చేసినట్లు పీఎంవో అధికారికంగా ధ్రువీకరించలేదు. అక్బర్‌ను పదవిలో కొనసాగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు కనబడుతోందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే అక్బర్ పదవికి వచ్చిన ప్రమాదమేమీ లేదని.. మంత్రివర్గంలో ఆయన కొనసాగవచ్చుని తెలుస్తోంది.

తనపై వచ్చిన ఆరోపణలను ఎంజే అక్బర్‌ ఖండించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తనపై ఆరోపణలు చేయడం వెనుక భారీ అజెండా ఉందని ఎంజే అక్బర్‌ ఆరోపించారు. కొందరు దురుద్దేశపూర్వకంగా కట్టుకథలతో ఆరోపణలు చేస్తున్నారని… తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు.

మరోవైపు బాలీవుడ్‌లో మీటూ ఉద్యమ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా టి-సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. మూడేళ్ల కిందట టి సిరీస్‌ బ్యానర్‌పై మూడు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదిరినప్పుడు.. తనతో ఓ రాత్రి గడిపితే సూపర్‌స్టార్‌ను చేస్తానని భూషణ్‌ కుమార్‌ వేధించారని ఆ మహిళ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కూడా ఇలానే ఒత్తిడి చేయడంతో తాను నిరాకరించానని, ఈ విషయం ఎవరికైనా చెబితే సిటీలో బతకకుండా చేస్తానని హెచ్చరించాడని వాపోయారు. కాగా, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను భూషణ్‌కుమార్‌ తోసిపుచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన మహిళపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.