వీణా వాణిల బంధానికి 16 ఏళ్లు..

వారిద్దరిదీ పదిహేనేళ్ల ప్రాణ బంధం. శరీరాలు వేరైనా.. ఒకటే ప్రాణం. తలలు అతుక్కుని పుట్టిన వీణావాణి… ఇవాళ పదహారో ఏట అడుగుపెట్టారు. అవిభక్త కవలలుగా పుట్టిన ఈ ఇద్దరమ్మాయిలను వేరు చేసేందుకు… డాక్టర్లు చేయని ప్రయత్నం లేదు. ఎప్పటికైనా తమ ఆశలు నెరవేరకపోతాయా అన్న ఆశతో కాలం గడుపుతున్న వీణా వాణి…

ఇవాళ పదిహేనవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెంకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్‌ 16 న జన్మించారు వీణావాణి. పుట్టుకతోనే అవిభక్తంగా ఉన్న వీరి శరీరాలను వేరు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. రెండేళ్ల వరకు గుంటూరులో డాక్టర్‌ నాయుడమ్మ దగ్గరున్న వీరిని.. 2006 లో హైదరాబాద్‌ నీలోఫర్‌కి తరలించారు. తర్వాత ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. శస్త్ర చికిత్స చేయలేమంటూ.. అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. ఆ తర్వాత లండన్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాల వైద్యులు.. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ముందుకొచ్చినా ఫలితం మాత్రం శూన్యం.

ప్రస్తుతం శిశువిహార్‌లో ఉంటూ.. ఎనిమిదో తరగతి చదువుతున్న వీణావాణి.. తమకు ఎప్పుడు ఈ బంధం నుంచి విముక్తి కలుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక అటు నిరుపేదలైన వారి తల్లిదండ్రులు… పిల్లలను చూడ్డానికి హైదరాబాద్‌ వెళ్లేందుకు సైతం తమ దగ్గర డబ్బులు లేవని వాపోతున్నారు. హైదరాబాద్‌లోనే ఏదో ఉపాధి చూపితే..
దగ్గరుండి బిడ్డల బాగోగులు చూసుకుంటామని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.