సోమవారాన్ని పోలవారంగా మార్చిన చంద్రబాబు..78వ సారి వర్చువల్‌ రివ్యూ

పోలవరం వడివడిగా పరుగులు పెడుతోంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ జీవనాడి, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై 78వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పోలవరం పనులను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. సోమవారాన్ని పోలవారంగా మార్చిన చంద్రబాబు.. 78వ సారి వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు.. ఈ సందర్భంగా 59.32 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఏపీ జీవనాడిగా భావిస్తున్న ప్రాజెక్టులో ఇప్పటికే కీలక ఘట్టం పూర్తైంది. ఢయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కేవలం 414 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రబాబు పరిశీలించారు. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో వేగంగా పనులు పూర్తవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తవ్వకం పనులు 79 శాతం, కాంక్రీట్ పనులు 41 శాతం పూర్తియినట్టు చెప్పారు. కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 64 శాతం పూర్తయినట్టు తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ దాదాపు 62 శాతం, కాఫర్ డ్యామ్‌ జెట్ గ్రౌంటింగ్ పనులు 97 శాతం పూర్తియినట్టు వివరించారు..

గత వారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4 లక్షల 52 వేల క్యూబిక్ మీటర్లమేర జరిగిన తవ్వకం పనులు.. త్వరలోనే పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం, పరిహారం విషయంలో వేగం పెంచాలని సూచించారు. నిర్వాసితులకు కేంద్రానికి మించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ సాఫీగా సాగకుండా చేసే కుట్రలను సహించొద్దని అధికారులకు దిశా నిర్దేశం చేశారు..