ఫారిన్ పారిపోయిన కేటుగాళ్లకు గట్టి హెచ్చరిక

neerav-modhi-and-vijay-malya-news

దేశంమీద పడి.. జనం డబ్బును కొల్లగొట్టి.. ఫారిన్ పారిపోయిన కేటుగాళ్లకు గట్టి హెచ్చరిక. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ స్థాయిలో కాకపోయినా.. ఆ తరహాలో బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన ఓ చిన్న చేపను స్వదేశానికి పట్టుకొస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఇందుకు దోహదం చేస్తోంది.

బెంగళూరుకు చెందిన 47 ఏళ్ల మొహమ్మద్ యాహ్యా 2003లో మోసానికి పాల్పడ్డాడు. రెండు బ్యాంకులకు 46 లక్షల రూపాయలు ఎగ్గొట్టాడు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు.. ఆరేళ్ల తర్వాత సీబీఐ విచారణ చేపట్టింది. విషయం సీరియస్‌ అవుతోందని గ్రహించిన యాహ్యా తెలివిగా బహ్రెయిన్‌ చెక్కేశాడు. కొన్ని ఏళ్ల తరబడి ఈ కేసు విచారణ సాగింది. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా అప్పు ఎగ్గొట్టాడని సీబీఐ తేల్చింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా యాహ్యాను దోషిగా తేల్చింది.

విజయ్ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతా వంటి బడాబాబులు బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుండడంపై దేశవ్యాప్తంగా ప్రజలు రగిలిపోతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నారు. దీన్ని గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏడాది కఠిన చట్టం తీసుకొచ్చింది. ప్రజల సొమ్ము దోచుకున్న కేటుగాళ్లు.. ప్రపంచంలో ఏమూల దాక్కున్నా.. స్వదేశానికి లాక్కొచ్చేలా చట్టానికి కోరలు వచ్చాయి. ఇప్పుడు యాహ్యాను బహ్రెయిన్‌ నుంచి భారత్‌కు తీసుకురావడం కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. ఆర్థిక నేరగాళ్లకు ముందు ముందు అసలు సినిమా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.