శబరిమలకు వారు వస్తే ఆత్మహత్య చేసుకుంటాం – శివసేన

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ అంశంపై కేరళ అట్టుడుకుతోంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలును వ్యతిరేకిస్తూ కేరళలో వేల మంది బీజేపీ కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు తిరువనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

నెలవారీ పూజల నిమిత్తం బుధవారం  అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు సిద్ధమయ్యారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో భౌతిక దాడులు తప్పవని కొంతమంది హెచ్చరిస్తే, శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. అటు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది. ఆలయం విషయంలో ప్రతిష్టంభన తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కేరళ బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్తత పెరిగింది.

శబరిమల ఆలయ ప్రవేశం వివాదం తారాస్థాయికి చేరింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్లాలంటూ పట్టుబడుతున్నాయి. అటు కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తీర్పును అడ్డుకోబోమంటూ గతంలోనే వెల్లడించింది. పందాలం రాజుకుటుంబీలుకు, ప్రధాన పూజారి కుటుంబసభ్యులతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. రేపటి నుంచి మొదలయ్యే మండలం, మకరవిలకు యాత్ర కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నెలవారీ కార్యక్రమాల నిమిత్తం రేపు తెరుచుకోబోతున్న శబరిమల ఆలయం ఈనెల 22న తిరిగి మూతపడుతుంది. ఆలయం లోపలకు మహిళలను అనుమతించేది లేదని, ప్రవేశ మార్గాల వద్దే వారిని నిలువరించేందుకు తాము అడ్డంగా పడుకుంటామని నిరసనకారులు ప్రకటించారు.