ఐక్యరాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగం గర్వకారణమే.. ఇది నిస్సందేహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించి మూడు వారాలు గడిచాయి. ఇప్పటికీ ఆ పర్యటనపై ఏదో ఒక విమర్శ చేయకుండా ఉండలేకపోతున్నారు కొందరు విపక్ష నేతలు. ఆయన పర్యటనకు ముందు అసలు చంద్రబాబుకు ఆహ్వానమే లేదన్నారు. తరువాత ఆయన పాల్గొంటున్న కార్యక్రమం అసలు యు.ఎన్ ప్రోగ్రామ్స్ లిస్టులో లేదన్నారు. జనరల్ అసెంబ్లీ హాల్లో ప్రసంగించడంలేదు కాబట్టి కీలక ప్రసంగం కాదన్నారు. తీరా ఆయన యు.ఎన్ హెడ్ క్వార్టర్స్ లో తన ప్రసంగాన్ని దిగ్విజయంగా ముగించుకుని వచ్చాక ఇప్పుడు వారు కొత్తగా చేస్తున్న విమర్శలు మరింత విచిత్రంగా తయారయ్యాయి.

నాటి అమెరికా అధ్యక్షుడుగా ఉన్న బిల్ క్లింటన్, నాటి మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ లతోనే ప్రశంసలు అందుకున్న చంద్రబాబుకు ఇప్పుడు కొత్తగా అంతర్జాతీయ వేదికలపై పేరు కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఉందా? ఆ స్ధాయికి చంద్రబాబు పడిపోయారని పదే పదే చెబుతూ ఆయన స్ధాయిని దిగజార్చే ప్రయత్నం ఏదో జరిగినట్లే ఉంది. కానీ వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టినా మళ్ళీ ఈ విషయంపై ఏదో ఒక కామెంట్లు చేస్తూ ఉండడం సరైందేనా?

అసలు చంద్రబాబు ఐక్యరాజ్య సమితి ప్రసంగం నేపథ్యం ఏంటో చూద్దాం.
ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశాలు సస్టేనబుల్ డెవెలెప్ మెంట్ చుట్టూనే తిరిగాయి. ఈ సస్టేనబుల్ డెవెలప్ మెంట్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన సబ్జెక్ట్. అది దేనికో తెలుసుకోవాలంటే ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న లక్ష్యాలను చంద్రబాబు పరిపాలనతో పోల్చిచూడాలి. ఆయన రాష్ట్రంలో తీసుకుంటూ వచ్చిన నిర్ణయాలను, ఆయన తన భవిష్యత్తు దృక్పథంపై పంచుకునే ఆలోచనలను పరిశీలించాలి.

యు.ఎన్ దృష్టిలో అభివృద్ధి అంటే ఆర్ధిక ప్రగతి మాత్రమే కాదు. అసమానతలను రూపుమాపడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, లింగ వివక్షకు తావు లేకుండా చేయడం, ఈ ప్రయత్నాల్లో సాంకేతికతను వాడుకోవడం. ఇవన్నీ ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న సస్టేనబుల్ డెవెలెప్ మెంట్ గోల్స్. వైజాగ్ లో హుదూద్ తుపాను విధ్వంసం తరువాత నగర పునర్నిర్మాణంలో చంద్రబాబు సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించారు. ఎల్.ఇ.డి లైట్లు అమర్చిన వీధి దీపాలు సమయానికి వెలిగి, సమయానికి ఆగిపోతున్నాయో లేదో తాను అభివృద్ధి చేయించుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పరిశీలించుకోగలిగారు. పర్యావరణం కోసం తక్కువ ఎలక్ట్రిసిటీ వాడే దీపాలు పెట్టించడం, అవి కూడా చీకట్లో వెలుగులు ఇస్తూనే మరోవైపు పగటి వేళ దుర్వినియోగం కాకుండా కూడా చూసేటట్లు ఏకంగా తన డ్యాష్ బోర్డ్ కే అనుసంధానం చేసుకున్నారు చంద్రబాబు.

ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి ఆయన పూర్తిగా పర్యావరణహితమైన మార్గం ఎంచుకున్నారు. సహజ కాంతిని వాడుకునేలా నిర్మాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సైకిల్, నడక మార్గాల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా చెట్లు, నగరంలో పార్కులు.. ఇవన్నీ ఆయన గ్రీన్ క్యాపిటల్ విజన్ లో భాగమే. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నదులను అనుసంధానం చేయాలనే లక్ష్యం పెట్టుకోవడం, ఎక్కడికక్కడ నీటి కుంటలు తవ్వి నీటిని సంరక్షించాలని పిలుపునివ్వడం, ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలను ముమ్మరం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నీటి సంరక్షణ ఆయన ప్రాధాన్యాల్లో ముందుంటోంది.

ఇక స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో మహిళా సాధికారతకు ఆయన చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. అందరికీ విద్య అందించాలనే ఆయన ప్రభుత్వ ప్రాధాన్యం భవిష్యత్తులో ఆర్ధిక వివక్షను, లింగ వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుంది. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించేశామని ఆయన యునైటెడ్ నేషన్స్ లో చెప్పలేదు. ఈ లక్ష్య సాధనలో సాధించిన పురోగతి గురించి మాత్రమే చెప్పారు.

ఇక వ్యవసాయం.. దీనికి సంబంధించే ఆయన ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. నిజానికి ఈ ప్రసంగంలో వివిధ దేశాల కేంద్ర మంత్రులతో వేదిక పంచుకున్న చంద్రబాబుపై సభ ప్రారంభంలోనే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం చీఫ్, నార్వే కేంద్ర మాజీ మంత్రి ఎరిక్ సోల్హైమ్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారంటూ, ఇప్పుడు కొత్త విధానాలను ప్రవేశపెడుతూ కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పెంచగలిగేట్లు చూడగలిగారని కొనియాడారు.

తరువాత జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ పై చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ వివరణాత్మకంగానూ, ఆసక్తికరంగానూ సాగింది. ఆయనకు సబ్జెక్ట్ పై ఉన్న అవగాహన, తన పరిపాలనపై తనకున్న అంకితభావం ప్రసంగంలో ప్రతిబింబించాయి. ప్రసంగం ముగిస్తూ ఆయన తన రాష్ట్రంలో ఇప్పుడు నాణ్యమైన ఉత్పత్తులు ఉన్నాయని, వాటికి మార్కెట్ కావాలని వ్యాఖ్యానించడం చూస్తే ఆయన ఏ సందర్భాన్నైనా రాష్ట్రానికి ఎంతో కొంత మేలు కలిగేటట్లు మలిచే ప్రయత్నం చేస్తారని మరోసారి తెలిసొచ్చింది.

ఇక ఇదంతా కూడా పరిపాలనా పరంగా ఆయన చేపట్టిన చర్యలను యు.ఎన్ గుర్తించి ఆహ్వానించిన తరువాత జరిగిందే. దీని గురించి అసలు చెప్పాల్సిన పరిస్ధితి కూడా వచ్చి ఉండకూడదు. ఆహ్వానం లేకుండానే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి, వివిధ దేశాల కేంద్ర మంత్రుల మధ్య ఆశీనులై, యు.ఎన్ పర్యావరణ విభాగం చీఫ్ ఎరిక్ తో ప్రశంసలు అందుకుని.. దౌత్యవేత్తలు, ప్రముఖులను ఉద్దేశించి ఎలా మాట్లాడతారు? ఇవేమైనా హేతుబద్ధత ఉన్న ఆరోపణలేనా? అంటే హాజరైన ప్రముఖులంతా అంత తేలికగా కనపడుతున్నారా? లేక వారితో కలిసి మీటింగ్ లో పాల్గొనడానికి భారతదేశ రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్ధాయి సరిపోదని అంటున్నారా ?

విపక్షాల ఆరోపణల గురించి ఒక భారత దౌత్యవేత్తను ప్రశ్నించగా ఆయన చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల గురించి ఏం చేస్తాంలే అంటూ, చంద్రబాబు యు.ఎన్ పర్యటనే కాదు, మొత్తంగా ఆయన అమెరికా పర్యటన అంతా విజయవంతమైందనీ, పర్యటనలో ఆయన కీలకమైన వ్యక్తులను కలిశారని అన్నారు. ఇకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటివి యు.ఎన్ సంస్ధలే. సస్టేనబుల్ డెవెలప్ మెంట్ గోల్స్ ను ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు ఎలా అమల్లో పెడుతున్నారో యు.ఎన్ కు స్పష్టంగా తెలిస్తే రాష్ట్రానికి ఏమైనా లాభం ఉంటుందేమో కానీ నష్టం ఉండదు. అసలే నిధుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రానికి భవిష్యత్తు ప్రయాణంలో యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆర్ధిక సంస్ధలు తోడుగా కలిసి వస్తే అది మంచిదే కదా.

అత్యంత విచిత్రమేంటంటే ఈ అవకాశాన్ని కూడా ఒక కుట్ర అంటూ అభివర్ణించారు ఒక జాతీయ పార్టీ ఎం.పీ. చంద్రబాబు ప్రసంగం వెనుక బి.ఎన్.పి పరిబాస్ అనే బ్యాంక్ పాత్ర ఉందనీ, రాష్ట్రానికి వందల కోట్లు అప్పు ఇచ్చే కుట్ర అని తాజాగా ఆరోపించారు. ఇవేం తమాషా విమర్శలో అర్ధం కాదు. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం బాండ్లు జారీ చేస్తే ప్రభుత్వం ఎక్కువ వడ్డీ ఇస్తోందని ఇదే విపక్ష నేతలు ఆరోపిస్తారు. మరోవైపు యునైటెడ్ నేషన్స్ తో కలిసి సస్టేనబుల్ డెవెలప్ మెంట్ కోసం కట్టుబడి ఉన్న అంతర్జాతీయ బ్యాంక్ ఏదైనా రాష్ట్ర కార్యక్రమాల కోసం తక్కువ వడ్డీకి నిధులు ఇచ్చేందుకు ఒకవేళ ముందుకొస్తే.. మరి అది కుట్ర ఎలా అవుతుంది? ఇటువంటి అప్పులకు వడ్డీ తక్కువగానే ఉంటుంది అనేది అందరికీ తెలిసిన సంగతేగా.
అంటే కేంద్రం నిధులు ఇవ్వదు, రాష్ట్రం బాండ్లు జారీ చేయకూడదు, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి నిధులు కూడా తీసుకోకూడదన్న మాట. అలా చంద్రబాబు నిధుల కొరతతో రేపు పరిపాలనలో సతమతమయితే ఆయనకు పరిపాలన చేతకానట్లన్న మాట.. రాజకీయ వ్యూహం బానే ఉంది. కానీ రాష్ట్రం పరిస్ధితి కూడా ఆలోచించాలి కదా.. ఇరవై నాలుగు గంటలూ రాజకీయాలే చేస్తూ పోతే ఇక అభివృద్ధి ఎప్పుడు జరిగేది ?

చంద్రబాబు ఐక్యరాజ్యసమితికి వచ్చిన రోజు, తరువాత రెండు రోజులు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడకు వచ్చారు. అనేక దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు హాజరయ్యారు. ఆ సమయంలో భద్రతా వలయానికి తోడు అమెరికా సీక్రెట్ సర్వీస్ నిఘా ఉంది. కానీ అంత హడావిడిలోనూ, దేశాధినేత హోదాలో ఏమీ వెళ్ళకపోయినా.. చంద్రబాబుకు ఆయన డెలెగేషన్ కు మర్యాదల్లో ఎటువంటి లోపం జరగలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎంత గౌరవం పొందుతారో.. అమెరికాలో ఐక్యారాజ్యసమితి సహా న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఆయన సందర్శించిన అన్ని ప్రాంతాల్లోనూ అంతే గౌరవ మర్యాదలు పొందారు. ఇంకా చెప్పాలంటే ఆయనతో కరచాలనం చేసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు అనేక మంది ప్రముఖులు ఆసక్తి చూపారు.

మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ప్రీతిపాత్రమైన సబ్జెక్ట్ సస్టేనబుల్ డెవెలప్ మెంట్ పై, తాను రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అత్యంత కీలకమైన అంతర్జాతీయ వేదిక యునైటెడ్ నేషన్స్ లో ప్రసంగించారు. తెలుగులోనే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భావితరాల కోసం ఐక్యరాజ్యసమితి ఏ చర్యలనైతే తీసుకోమని అన్ని దేశాల్ని కోరుతోందో… ఆ చర్యలను ఒక తెలుగు ముఖ్యమంత్రి.. తనకున్న పరిమిత వనరులతోనే.. ఇప్పటికే అమల్లో పెడుతున్న సంగతి అక్కడ చెబితే.. అది గర్వించదగ్గ విషయం కాదా.