అమలాపురంలో ఈ రోజు రాత్రి జరగనున్న విన్యాసాలు.. పోలీసుల పటిష్ట బందోబస్తు..

కోనసీమ కేంద్రమైన అమలాపురంలో జరిగే శరన్నవరాత్రులకు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ రాత్రి భారీ ఊరేగింపులు నిర్వహించనున్నారు. కొన్ని వీధుల్లో వాహనాలు ఊరేగిస్తుండగా.. మరికొన్ని వీధుల్లో వీరత్వానికి ప్రతీకగా నిలిచే చెడీ తాలింఖానా నిర్వహిస్తారు. పట్టణంలోని కొంకాపల్లి, శ్రీరామపురం, మహీపాల వీధి, నల్లవీధి, గుండు వీధి, రవణం వీధి, రవణం మల్లయ్య వీధులలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

మైసూర్‌ తరహాలో జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు రెండుకళ్లు చాలవంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కర్రలు, కత్తులు, భల్లాలు, లేడి కొమ్ములు, అగ్గి బరాటాలు, సరిగమలు, బంతుల తాళ్లు, అగ్గి తాళ్లు వంటి వాటితో ఒళ్లు గగుర్పాటు కలిగించే విన్యాసాలను చెడీ తాలింఖానాలో ప్రధానంగా నిర్వహిస్తారు. కళ్లకు గంతలు కట్టుకొని పొట్టపై ఉంచిన కాయగూరలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు వంటివి కత్తులతో నరకడం నిర్వహిస్తారు.

మూడేళ్ల బాలుడి నుంచి వృద్ధుల వరకు కర్రలు, కత్తులతో నిర్వహించే విన్యాసాల్లో పాల్గొంటారు. వాహనాలను వైభవంగా అలంకరించి సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించే విధంగా కళారూపాలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.