మీటూ ఎఫెక్ట్.. మేనేజర్ ఆత్మహత్యాయత్నం..

మీటూ ఉద్యమం.. మిమ్మల్నీ వదిలేది లేదంటూ బాధితులంతా ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు.. చెబితే ఎక్కడ పరువు పోతుందో అని భావించాం. ఇప్పుడు ధైర్యంగా చెప్పి మీ పరువు బజారుకి ఈడ్చాలనుకుంటున్నాం అంటూ లైంగిక వేధింపులకు గురైన వారంతా తాము అనుభవించిన మానసిక క్షోభను నలుగురితో పంచుకుంటున్నారు. మరి కొంత మంది అమ్మాయిలు ఈ దుర్మార్గులకు బలి కావద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి వెన్నులో వణుకుపుడుతోంది. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందో అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలకు మేనేజర్‌గా పనిచేస్తున్న అనిర్బన్ బ్లష్ మీటూ ఎఫెక్ట్ కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆడిషన్స్ పేరుతో అనేకమంది మోడల్స్, నటీమణులను వేధింపులకు గురిచేశారని అతడిపై ఆరోపణలు రావడంతో సంస్థనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మానసికంగా డిప్రషన్‌కు గురైన అనిర్బన్.. ముంబైలోని వాషి బ్రిడ్జి పై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనిర్బన్‌ని కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మీటూ కారణంగా కుటుంబం కూడా అతడికి దూరంగా ఉంటోంది.