వివాదాస్పదంగా మారిన శబరిమల విషయంపై స్పందించిన సూపర్‌స్టార్..

కేరళలో వివాదాస్పదంగా మారిన శబరిమల టెంపుల్ అంశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలంతా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయప్ప స్వామిని దర్శించుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రజనీ స్వాగతించారు. అయితే శబరిమల ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలని సూచించారు.

ఎన్నో ఏళ్లుగా ఆలయంలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని మార్చడం అనేది మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంది. ఇలాంటి అంశాలపై ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. తొందర పడి వివాదాలు కొని తెచ్చుకోవద్దని ఆయన తెలిపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని ఎవరూ వ్యతిరేకించరు.. కానీ మత సంబంధమైన అంశాల్లో మహిళలకు సమాన అవకాశాలతో ముడిపెట్టవద్దంటూ ఆయన సూచించారు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించడం.. మహిళలపై వివక్ష చూపడం కాదని.. రజనీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

శబరిమల అంశం ఇటీవల చాలా వివాదాస్పదంగా మారింది. అందుకే దీనిపై సెలబ్రెటీలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. కాని ఇప్పుడు సూపర్ స్టారే డైరెక్ట్ గా స్పందించడంతో మిగిలినవాళ్లు కూడా ముందుకు వచ్చే అవకాశముంది.