లవర్‌తో వెళ్లిపోతున్నానని తండ్రికి మేసేజ్‌ చేసిన కూతురు.. అది చూసి..

పరువు కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పునరావృతం అవుతూనే ఉన్నాయి. అనంతపురంలో తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. కూతురు ఎవరినో ప్రేమించి పెళ్లిచేసుకుందని మనస్తాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

అనంతపురంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన భరత్‌… తన ఇద్దరు కూతుళ్లను అల్లారుముద్దుగా పెంచాడు. పెద్దకూతురు రూపాలికి ఘనంగా పెళ్లి చేశాడు. బెంగళూరులో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదువుతున్న రెండో కూతురు సోనాలి.. గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ రాయ్‌తో ప్రేమలో పడింది. తాను వివాహం చేసుకుని వెళ్లిపోతున్నానని.. తన గురించి వెతకవద్దని.. శనివారం మధ్యాహ్నం తండ్రి భరత్‌కు మేసేజ్‌ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భరత్‌.. గార్లదిన్నె రైల్వేట్రాక్‌పై రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ముక్కలుగా పడి ఉన్న భరత్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.