వితంతు మహిళతో వెకిలి చేష్టలు.. బడితెపూజ చేసిన..

ఓవితంతు మహిళను వేధిస్తున్న ఆకతాయికి స్థానికులు తగిన బుద్ధి చెప్పారు. అతనికి బడితెపూజ చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సదరు మహిళ చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. ఓ యువకుడు గత నెలరోజులుగా ఆ మహిళను వేధించసాగాడు. దీంతో ఆకతాయి వేధింపులు.. శృతి మించడంతో బాధితురాలు స్థానికులకు తన గోడు చెప్పుకుని బోరుమంది.

ఈరోజు శంషాబాద్‌ బస్టాండ్ వద్దకు చేరుకున్న యువకుడు మరోసారి వెకిలి చేష్టలను ప్రదర్శించడంతో స్థానికులు పట్టుకుని ఆకతాయికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని గూడూరు వాసిగా గుర్తించారు..