మార్కెట్లు రీబౌండ్‌-లాభాలతో షురూ!

గత వారం చివర్లో భారీ అమ్మకాలతో పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఆసియా స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడం, ఎఫ్‌అండ్‌వో ముగింపు ముందుండటం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీతో ప్రారంభమైంది. ప్రస్తుతం 149 పాయింట్లు ఎగసి 34,465కు  చేరింది. తొలుత 34,748ను తాకింది. ఇక నిఫ్టీ ప్రస్తుతం 41 పాయింట్లు బలపడి 10,345 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం యూరప్‌, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఐటీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని  బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 0.7-0.4 శాతం మధ్య పుంజుకోగా… ఐటీ దాదాపు 1 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 6 శాతం జంప్‌చేయగా, ఐషర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, ఎన్‌టీపీసీ, వేదాంతా, ఇండస్‌ఇండ్ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్, ఐవోసీ, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ 3.4-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో శ్రేఈ ఇన్‌ఫ్రా, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, చోళమండలం, హెచ్‌సీసీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పిరమల్‌, జిందాల్‌ స్టీల్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇన్ఫీబీమ్, ఇండిగో, డిష్‌ టీవీ, మైండ్‌ట్రీ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు ప్లస్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 832 లాభపడగా… 414 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.