పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి భారీ ఏర్పాట్లు

vijayanagaram-paidithalli-ammavari-festival

విజయనగరంలో నిర్వహించే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. 60 అడుగుల నిడివి గల సిరిమాను రథం శిఖరంపై ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ఆసీనులైన తరువాత మధ్యాహ్నం 3 గంటలకు చదురుగుడి నుంచి ఉత్సవం ప్రారంభంకానుంది. చదురుగుడి నుంచి కోట వరకు ముమ్మారు ప్రదక్షిణ చేస్తుంది.

విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం

శబరిమల ఆలయ ద్వారాలు మూసివేసిన అర్చకులు

పులివేషాలు, నృత్యాలతో రథం ముందుకు సాగుతుంటే.. రథానికి ముందు వరసలో జాలరి వల, అంబారీ, పాలధార ఉంటాయి. అమ్మవారు కోటకు చేరుకున్న తరువాత పూసపాటి వంశీయుల అనువంశిక ధర్మకర్త, ఎంపీ అశోక్ గజపతిరాజుకు ఆశీస్సులందజేస్తుంది. ఈ విధంగా ముమ్మారు ప్రదక్షిణలు చేస్తుంది. ఉత్సవాన్ని తిలకిస్తే కోరిన కోర్కెలు ఈరేడుతాయని భక్తుల నమ్మకం.

సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. సిరిమానోత్సవం రోజున ఆలయ పూజారిలోకి అమ్మవారు ప్రవేశించి ఊరేగుతారని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవానికి ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ నుంచి భక్తులు రావడం ఆనవాయితీగా వస్తోంది.

లక్షలాది జనం పట్టణానికి తరలివస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక.. ప్రతిఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఉత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు.