ఎయిర్‌టెల్‌, హెక్సావేర్‌ నష్టాల వేవ్స్‌

ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గత నెలలో సబ్‌స్ర్కైబర్లను పెంచుకోవడంలో వెనకడుగు వేయడంతో ఇన్వెస్టర్లు నిరాశకు లోనయ్యారు. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఈ ఏడాది(2018-19) క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ ఐటీ సేవల సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. వివరాలు చూద్దాం…

భారతీ ఎయిర్‌టెల్‌
మొబైల్‌ సేవల రంగంలో పోటీ పెరగడంతోపాటు ఇటీవల యూనినార్‌ కొనుగోలు కారణంగా ఈ ఏడాది క్యూ2లో భారతీ ఎయిర్‌టెల్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు ఆగస్ట్‌ నెలలో రిలయన్స్‌ జియో 1.2 కోట్లమంది కొత్త సబ్‌స్క్రైబర్లను జత చేసుకోగా.. వొడాఫోన్‌ 11.4 లక్షల మందిని సంపాదించింది. ఇక ఎయిర్‌టెల్‌ 10 లక్షల మందిని కొత్తగా చేర్చుకుంది. కాగా.. క్యూ2లో ఎయిర్‌టెల్‌ భారీ స్థాయిలో నికర నష్టం ప్రకటించే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. నేడు కంపెనీ క్యూ2 ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 300 వద్ద ట్రేడవుతోంది.

హ్యూందాయ్ కొత్త మోడల్‌ .. కేవలం రూ. 3.7 లక్షలే

హెక్సావేర్‌ టెక్నాలజీస్
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో హెక్సావేర్‌ టెక్నాలజీస్ నికర లాభం 21 శాతం పెరిగి రూ. 172 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 1210 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం పుంజుకుని 187 కోట్లయ్యింది. అయినప్పటికీ ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 333 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 317 దిగువకు సైతం చేరింది.