పెళ్లికి రమ్మని పిలిచింది.. తీరా వెళ్లి చూస్తే..

నేనంటే నాకిష్టం. అందుకే నన్ను నేనే పెళ్లి చేసుకుంటా.. ఇదేదో వినడానికే వింతగా ఉంది. ఓ అబ్బాయి అమ్మాయి పెళ్ళిచేసుకునే సంఘటన సాధారణం. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయిలని, అమ్మాయిలు అమ్మాయిలని ఇష్టపడుతున్నారు ఆనక పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. అదేమంటే మా ఇష్టం అండీ… మీకేమైనా నష్టమా అని ప్రశ్నిస్తున్నారు. సరే మనకెందుకులే అనుకుంటే మరీ వెరైటీగా తనని తానే పెళ్లి చేసుకోవడం. ఇంతకీ కథ ఏంటని ఆరా తీస్తే..

ఆఫ్రికా దేశంలోని ఉగాండాలో నివసిస్తున్న లూలూ జెమిమాకు 32 ఏళ్లు వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మనదేశంలో తల్లిదండ్రులు బాధపడ్డట్టే అక్కడ కూడా ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే తల్లీ అంటూ అమ్మా నాన్న పోరు పెడుతున్నారు. ఇద్దరు పిల్లలకి తల్లి కావాల్సిన వయసులో ఓ అచ్చటా ముచ్చటా లేకుండా ఏం చేద్దామని అంటూ వెంటపడుతున్నారు. స్నేహితులు సైతం ఇదే గోల. ఇదెక్కడి పెళ్లి గోల బాబోయ్ అంటూ.. తీవ్రంగా ఆలోచించింది. ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చింది.

ప్రతిరోజూ ఫోన్ చేసి విసిగిస్తున్న తల్లిదండ్రులకి ఈ సారి తనే ఫోనే చేసి నేను ఒకరిని ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఫిక్సయింది. వివాహ వేదిక కూడా ఇక్కడే. మీరు కూడా వస్తే బావుంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. బంధువులని, స్నేహితుల్ని అందర్నీ అలానే ఆహ్వానించింది. వరుడు ఎవరనేది సస్పెన్స్‌లో పెట్టింది.

పెళ్లి రోజు రానే వచ్చింది. లూలూ అందంగా ముస్తాబైంది. పెళ్లి కూతురు వేసుకునే గౌను కూడా ధరించింది. వచ్చిన అతిధులంతా వరుడికోసం వెతుకుతున్నారు. వివాహ వేదిక వద్దకు వచ్చిన లూలూ అతిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా పెళ్లికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఆ తరువాత అసలు విషయం చెప్పింది. తనకు చదువుకోవడం అంటే ఇష్టమని.. ఓ మంచి పొజిషన్‌లో ఉండాలని కలలు కంటున్నాని.. అందుకే పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చానని తెలిపింది. అయితే తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమంటూ వేధిస్తుండడంతో ఇష్టంలేని పెళ్లి చేసుకుని మరొకర్ని ఇబ్బంది పెట్టలేక నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నానని తెలిపింది. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని తెలిపింది. వచ్చిన అతిధులంతా అర్థం చేసుకుని లూలూ కోరిక నెరవేరాలంటూ ఆశీర్వదించారు.

అత్త అనుమానం.. కోడలికి శీల పరీక్ష..

ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్న లూలూకి జీవితం పట్ల చాలా ఆశలు ఉన్నాయి. మంచి ఉద్యోగం చేయాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆరాట పడుతోంది. పెళ్లి ఏర్పాట్లనీ ఖర్చు లేకుండా ప్లాన్ చేసుకుంది. వేసుకున్న గౌను కూడా స్నేహితురాలు గిప్ట్‌గా ఇచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే ఇది అరుదైన పెళ్లిగా లూలూ జెమిమా పేరు నిలిచిపోయింది.