ఒడిదొడుకులతో షురూ- ఫార్మా జోరు!

దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలై వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం తిరిగి కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 102 పాయింట్లు పెరిగి 33,451కు చేరగా.. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 10,063 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన అమెరికా మార్కెట్లు పతనంకాగా.. ఆసియాలోనూ ప్రస్తుతం అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 33,579 వద్ద గరిష్టాన్నీ, రూ. 33,342 వద్ద కనిష్టాన్నీ తాకింది. కాగా..   యూఎస్‌ టెక్‌ దిగ్గజాలు అమెజాన్‌, అల్ఫాబెట్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం అమెరికా మార్కెట్లు వెనకడుగు వేశాయి.

ఆటో, బ్యాంక్స్‌ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం అత్యధికంగా 3 శాతం జంప్‌చేయగా..  ఆటో, బ్యాంకింగ్ 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఫార్మా కౌంటర్లలో దివీస్‌ లేబ్స్‌ 12 శాతం దూసుకెళ్లగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో, లుపిన్‌, సన్‌ ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్‌, సిప్లా 3.6-1.3 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ దాదాపు 7 శాతం జంప్‌చేయగా.. ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, హీరోమోటో 4-1.2 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, హిండాల్కో, హెచ్‌యూఎల్‌ 3-0.6 శాతం మధ్య క్షీణించాయి.

Read Also: ఘోర విమాన ప్రమాదం.. 200 మంది ప్రయాణీకులు..

రేమండ్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో రేమండ్‌, గ్రాన్యూల్స్‌, టొరంట్‌ ఫార్మ, వొకార్డ్‌, బాష్‌ 8-2.4 శాతం మధ్య జంప్‌చేయగా… జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 7 శాతం పతనంకాగా.. ఈక్విటాస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, అదానీ పవర్‌, ఇన్ఫీబీమ్‌, ఆర్‌కామ్‌, భారత్‌ ఫైనాన్స్‌, కేన్‌ఫిన్‌ 4-2 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు పుంజుకోవడంతో చిన్న షేర్లలోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 702 లాభపడగా… 519 నష్టాలతో ట్రేడవుతున్నాయి.