పంత్‌ కోసం ధోనీని తప్పించే సాహసం కోహ్లీ చేస్తాడా?

విండీస్‌తో తాడో పేడో తేల్చుకోడానికి విరాట్‌ సేన సై అంటోంది. రెండు జట్ల మధ్య నాలుగో వన్డే ఇవాళ ముంబైలో జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది. వరుసగా ఒక టై.. ఒక ఓటమితో భారత్‌ షాక్‌లో ఉంది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేదనుకున్న విండీస్‌ టీం ఇప్పుడు సిరీస్‌ విక్టరీని టార్గెట్‌ చేసింది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

బ్యాటింగే బలమని నమ్ముకున్నా గత రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ కోహ్లీ మినహా అంతా చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ శుభారంభాలు ఇవ్వడం లేదు. చివరి రెండు వన్డేల్లో రోహిత్‌ 4, 8 పరుగులతో నిరాశపరిచాడు. ధావన్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. కెప్టెన్‌ కోహ్లీ అత్యద్భుత ఫామ్‌ మాత్రమే జట్టుకు బలంగా మారింది. రాయుడు మూడు మ్యాచ్‌ల్లో ఓ అర్ధ సెంచరీ సాధించగలిగాడు. రిషభ్‌ పంత్‌ తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ధోనీ ఫాంలో లేక తంటాలు పడుతున్నాడు. దీంతో కేదార్‌ జాదవ్‌ను మిడిలార్డర్‌లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. విఫలమవుతున్న ధోనీని పక్కకు తప్పించి పంత్‌కు కీపింగ్‌ అప్పగించే సాహసం కోహ్లీ చేస్తాడా? అనేది అనుమానమే.

మరోవైపు విండీస్ టీం ఫుల్‌ జోష్‌లో ఉంది. రెండో వన్డే టై చేసుకోవడంతో పాటు మూడో వన్డేలో విజయంతో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. షాయ్‌ హోప్‌ వరుసగా 123, 95 స్కోర్లతో సవాల్‌ విసురుతున్నాడు. ఇక హెట్‌మయెర్‌ తుఫాన్‌ ఆటతీరు ఆ జట్టుకు అండగా మారింది. కీరన్‌ పావెల్‌, హేమరాజ్‌, హోల్డర్‌ కీలక సమయంలో బ్యాట్‌ ఝుళిపిస్తే భారత్‌కు మరిన్ని కష్టాలు తప్పవు.