సముద్రంలో కూలిన ఫ్లైట్‌.. 189 మంది దుర్మరణం.. ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 189 మందితో టేకాఫ్ తీసుకున్న లయన్‌ ఎయిర్‌ ఫ్లైట్‌… సముద్రంలో కూలిపోయింది. అందులోని ప్రయాణికులంతా జలసమాధి అయినట్టే అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

విమానయానంలో విషాదాల చరిత్ర ఉన్న ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లయన్ ఎయిర్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సముద్రంలో కూలిపోయింది. జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సిబ్బందితో కలిసి మొత్తం 189 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు ఫ్లైట్ బయలుదేరింది. 6 గంటల 33 నిమిషాలకు ATCతో సంబంధాలు తెగాయి. కాసేపటికే అది కూలినట్టు నిర్థారించారు.

Also Read : ఘోర విమాన ప్రమాదం.. 200 మంది ప్రయాణీకులు..

విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అది కూలిన చోటు గుర్తించేందుకు ఆపరేషన్ మొదలైంది. పశ్చిమ జావా ప్రాంతంలో శకలాలను గుర్తించారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని ప్రయాణికుల డెడ్‌బాడీలు వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బోయింగ్ 737 విమానంలో 210 మంది ప్రయాణించొచ్చు. 181 మంది ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరింది. కాసేపటికే దుర్ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రమాదానికి గురైన విమానానికి ఢిల్లీకి చెందిన భవ్వే సునేజా పైలట్‌గా వ్యవహరించారు. 31 ఏళ్ల సునేజా చాలా అనుభవమున్న పైలట్‌ అని అతని సన్నిహితులు, లయన్ ఎయిర్ అధికారులు తెలిపారు. 2011లో లయన్ ఎయిర్‌లో పైలట్‌గా చేరిన సునేజా ఎక్కువగా బోయింగ్‌ 737 విమానాన్నే నడిపేవారని తెలిపారు. కొంత కాలంగా తన స్వస్థలమైన ఢిల్లీలో పోస్టింగ్ ఇప్పించాలని కోరుతున్నారు. ఇంతలోనే పెను ప్రమాదం జరగడంతో అతని కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.