నెలల చిన్నారితో డ్యూటీ.. నెటిజన్స్ ఫిదా..

అమ్మలోని కమ్మదనాన్ని అందిస్తోంది. పోలీస్ అధికారిగా కరుకు దనాన్ని ప్రదర్శిస్తోంది డ్యూటీలో ఉన్న ఓ మహిళా పోలీస్ అధికారి. మహిళకు మాత్రమే సాధ్యం అన్ని పనులు అవలీలగా చేయగలగడం. అంతరిక్షంలో కాలుమోపినా అమ్మగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను ఎంచుకున్న రంగంలో రాణిస్తూ అమ్మ ప్రేమని బిడ్డకి పంచుతుంది. బరువైన బాధ్యతల్ని భుజానికెత్తుకుని ఇష్టంగా చేస్తుంది. నెలలు నిండేదాకా డ్యూటీ చేస్తారు. 4నెలల విరామం తీసుకుని మళ్లీ డ్యూటీలో జాయినైపోతారు మాతృమూర్తులు.

Also Read: లంక సంక్షోభానికి మరో ట్విస్ట్‌ ఇచ్చిన స్పీకర్ జయసూర్య

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా సింగ్ అనే మహిళా కానిస్టేబుల్ తన నెలల పాపని కూడా తీసుకుని వచ్చి డ్యూటీ చేస్తోంది. ఉన్న ఊరిలో ఉద్యోగం అయితే మధ్యలో వెళ్లి చూసుకోవడానికి ఉంటుంది. కానీ పొరుగూరులో ఉద్యోగం, అయిన వాళ్లెవరూ దగ్గర లేకపోవడంతో పాపని తనతో తెచ్చుకుంది. కళ్లముందే చిన్నారిని పడుకోబెట్టుకుని డ్యూటీలో నిమగ్నమైంది. అమ్మ తన దగ్గరే ఉందన్న ధైర్యంతో పాపాయికూడా హాయిగా నిద్రపోతోంది. ఇదంతా చూసిన తోటి కొలీగ్స్ తల్లీ బిడ్డలిద్దరినీ ఫోటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిమిషాల్లో అది వైరల్ అయింది. ప్రభుత్వాధికారులకు విషయం తెలిసింది. ఆమెను వెంటనే తన ఊరికి బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్చన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ బిడ్డని ఉత్తమ పౌరురాలిగా తయారు చేస్తానంటోంది. నెటిజన్స్ పోలీసమ్మకు జేజేలు పలుకుతున్నారు.