గ్రామస్థుల జీవితాల్లో చీకట్లు నింపిన పటేల్ విగ్రహం..

ప్రపంచంలోనే ఎత్తయినదిగా రికార్డు సృష్టించబోతున్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కాంస్య విగ్రహంపై ప్రారంభానికి ముందే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. గుజరాత్‌లోని నర్మదా నది పై నిర్మించిన సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమవుతున్న వేళ… స్థానిక గ్రామాల ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావొద్దంటూ.. మోదీకి బహిరంగ లేఖ రాశారు. తమ బతుకులను రోడ్డున పడేసి.. పటేల్‌ విగ్రహాన్ని స్థాపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ పేరిట ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ విగ్రహ స్థాపన.. తమ జీవితాల్లో చీకట్లు నింపిందని కెవాడియా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను,బాధను బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా లేమని.. లేఖలో పేర్కొన్నారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు సమీపంలో ఉన్న 22 గ్రామాల పెద్దలు.. ఈలేఖపై సంతకాలు చేశారు. ప్రధాని పాల్గొనే ఈ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

Also Read : కూల్‌డ్రింక్ కన్నా.. 1జీబీ డేటా చీప్

ఈ ప్రాజెక్టు ద్వారా తమకు నీడనిస్తున్న ప్రకృతి వనరులను ధ్వంసం చేశారని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినదిగా నిర్మితమైన సర్దార్‌ పటేల్‌ విగ్రహంతో.. తమ జీవితాలు రోడ్డున పడ్డాయని బాధపడుతున్నారు. అడవులు, నదులు, జలపాతాల నడుమ తమ జీవితాలు ఆనందమయంగా గడిచేవనీ.. ఇప్పుడు వాటన్నింటినీ ధ్వంసం చేసి తమ భవిష్యత్తును చీకటిమయం చేశారని.. ఇతరుల ప్రాణాలు తీసి మీరు పండుగ చేసుకుంటున్నారంటూ లేఖలో ఆరోపించారు. తాము వద్దంటున్నా.. ఆహ్వానం లేని అతిథిగా ప్రధాని ఇక్కడికి రావొద్దని సూచించారు.

నర్మదా ప్రాజెక్ట్‌ సమీపంలో ఎన్నో గ్రామాల్లో కనీస వసతులు లేవనీ.. పాఠశాలలు, ఆసుపత్రులు కూడా లేవని.. వాటిని ఏర్పాటు చేకుండా కోట్లు ఖర్చుచేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటనీ గిరిజన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సర్ధార్‌ పటేల్‌ బతికి ఉంటే.. మీరు చేసిన ప్రకృతి విధ్వంసం చూసి కన్నీటి పర్యంతమయ్యేవారని గ్రామస్థులు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇక, నర్మదా ప్రాజెక్ట్‌ పరిసరాల్లో నివసించే 72 గిరిజన గ్రామాల ప్రజలు.. ప్రధాని ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. వంటలు వండుకోకుండా ఆకలితో వచ్చి.. ప్రధాని పాల్గొనబోయే ఈవెంట్‌లో నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు, పటేల్‌ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. నర్మదా కెనాల్‌నెట్‌వర్క్‌ను పూర్తి చేయలేదుగానీ.. కోట్లు ఖర్చుచేసి విగ్రహాన్ని పూర్తి చేశారని మండిపడింది. సర్దార్‌ పటేల్‌కు నివాళి అర్పించాలనుకుంటే.. నర్మదా ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని గుజరాత్‌ సీఎంకు సవాల్‌ విసిరింది.