పడిలేచిన కడలితరంగంలా..దెబ్బతిన్న బెబ్బులిలా.. గర్జించిన టీమ్ ఇండియా

ముంబై వన్డేలో టీమిండియా బంపర విక్టరీ కొట్టింది. 224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో రోహిత్‌శర్మ , అంబటి రాయుడు సెంచరీలతో రెచ్చిపోతే… బౌలింగ్‌లో యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌ అదరగొట్టాడు. దీంతో వన్డేల్లో భారత్‌ మూడో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

పుణే వన్డే షాక్‌తో తేరుకున్న టీమిండియా ముంబైలో రెచ్చిపోయింది. వెస్టిండీస్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో ముందుగా చెప్పుకోవాల్సింది రోహిత్‌శర్న బ్యాటింగ్ గురించే…తనదైన రోజున ఎవ్వరూ ఆపలేరని మరోసారి నిరూపించాడు. వన్డేల్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరున్న రోహిత్‌ బ్రౌబౌర్న్ స్టేడియంలో రెచ్చిపోయాడు. కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు చేసి తన పేరు రోహిత్‌ కాదని రోహిట్‌ అంటూ మరోసారి గుర్తు చేశాడు.

కెరీర్‌లో రోహిత్‌కు ఇది 21వ వన్డే సెంచరీ. కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఇన్ని శతకాలు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.అలాగే వరుసగా తొమ్మిది వన్డే సిరీస్‌లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ డబుల్ సెంచరీ సాధించేలా కనిపించినా… వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు.

సముద్రంలో కూలిన ఫ్లైట్‌.. 189 మంది దుర్మరణం.. ప్రమాదం ఎలా జరిగిందంటే..

రోహిత్‌ ఇన్నింగ్స్‌తో పాటు తెలుగుతేజం అంబటి రాయుడు ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో నిలకడగా రాణిస్తోన్న రాయుడు సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ 377 పరుగుల భారీస్కోర్ సాధించింది.

ఛేజింగ్‌లో విండీస్ త్వరగానే చేతులెత్తేసింది. ఓపెనర్లతో పాటు ఈ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తోన్న హోప్ , హెట్‌మెయిర్‌ తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అటు కోహ్లీ, కుల్‌దీప్‌యాదవ్ మెరుపు ఫీల్డింగ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా కోహ్లీ ఒంటిచేత్తో కిరణ్‌ పావెల్‌ను ఔట్ చేసిన తీరు అదిరిపోయింది. మొత్తం మీద కోహ్లీసేన ఆధిపత్యంతో విండీస్‌ ఇన్నింగ్స్‌కు 153 పరుగులకే తెరపడింది. వన్డేల్లో టీమిండియాకు ఇది మూడో అతిపెద్ద విజయం. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీసేన 2-1 ఆధిక్యంలో నిలిచింది.