ఆర్‌బీఐ ఎఫెక్ట్‌- నష్టాల ఓపెనింగ్‌!?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 25 పాయింట్లు నీరసించి 10,204 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ డిప్యూటీ గవర్నర్‌ అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో కొంతమేర సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో నేడు మార్కెట్లు ప్రతికూలంగా కదిలే వీలున్నట్లు చెబుతున్నారు. కాగా… ఆద్యంతం కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో నిలిచాయి. పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూసిన సెన్సెక్స్ ట్రేడింగ్‌ ముగిసేసరికి 34,000 పాయింట్ల కీలక మార్క్‌ను మరోసారి కోల్పోయింది. చివరికి 176 పాయింట్లు తక్కువగా 33,891 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 53 పాయింట్ల వెనకడుగుతో 10,198 వద్ద ముగిసింది. అయితే రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతోముగిశాయి.

 

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,154 పాయింట్ల వద్ద, తదుపరి 10,110 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,264 పాయింట్ల వద్ద, తదుపరి 10,329 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 24622, 24437 వద్ద మద్దతు లభించవచ్చని, 25057, 35304 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

అమ్మకాలు ఆపని ఎఫ్‌ఫీఐలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1592 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా… ఇందుకు ధీటుగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1363 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ.  దాదాపు రూ. 2231 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2527 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.