ష్.. ఫ్లైట్‌లో 5 నిమిషాల కంటే ఎక్కువ ఏడ్చావంటే..

నెలల పిల్లలు దేనికి ఏడుస్తుంటారో ఒక్కోసారి అర్థం కాదు. బొజ్జనిండుగా ఉన్నాయి బుజ్జాయి ఏడుపు ఆపట్లేదు. అసలే విమానంలో ఉన్నారు. ఎలా సముదాయించాలో తెలియట్లేదు అమ్మకి.

పక్కనున్న వాళ్లు.. బాబు అలా ఏడుస్తుంటే పట్టించుకోవట్లేదని అనుకుంటారే తప్ప అర్థం చేసుకునేవారు అరుదుగా కనిపిస్తారు. 8 నెలల బాబుతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ జంటకి ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది.

భర్తతో కలిసి సిడ్నీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్లైట్‌లో వెళుతోంది ఫేస్‌బుక్‌లో ఉద్యోగం చేస్తున్న కృపాబాల. అప్పటి వరకు అమ్మ ఒడిలో వెచ్చగా పడుకున్న బాబు ఉన్నట్టుండి ఏడుపు అందుకున్నాడు. ఎంతకీ ఆపట్లేదు. పాలు పట్టినా తాగట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అమ్మకి. బాబు ఏడుపుకి వెనుక సీట్లో కూర్చున్నవారు కూడా అసహనానికి గురవుతున్నారు.

Read Also:ట్రాఫిక్ పోలీసులకే షాక్ ఇచ్చిన చలాన్ నెం.136

విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది కృపాబాల దగ్గరకు వచ్చి బాబు 5 నిమిషాలకంటే ఎక్కువ ఏడిస్తే అనుమతించేది లేదన్నాడు సీరియస్‌గా. వాడు అంతలా ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక నేను బాధపడుతుంటే సిబ్బంది వచ్చి ఆ విధంగా మాట్లాడేసరికి ఆశ్చర్యపోయానంటూ ఫేస్ బుక్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులకు తెలియజేసింది. దాంతో వారు ఆమెకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు టికెట్స్‌ను కూడా రిఫండ్ చేసింది.