చివరి వన్డేలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్.. రికార్డ్‌ బ్రేక్‌ చేసిన..

స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన కోహ్లీ సేన… వన్డే సిరీస్‌ను దక్కించుకుంది. 2016 నుంచి వరుసగా ఆరో సిరీస్‌ను కైవసం చేసుకుని.. రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. ఆఖరి వన్డేలోనూ విండీస్‌ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది.

సొంతగడ్డపై తిరుగులేని ఫామ్‌లో ఉన్న టీమిండియా.. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం వేదికగా చివరి వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 3-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. 2015లో దక్షిణాఫ్రికాపై సిరీస్‌ నుంచి.. స్వదేశంలో భారత జట్టు ఒక్క వన్డే సిరీస్‌ కూడా చేజార్చుకోలేదు.

ఆఖరి మ్యాచ్‌లో విండీస్‌ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్‌ శర్మ 63 పరుగులు, విరాట్‌ కోహ్లి 33 పరుగులతో మరోసారి రాణించారు. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ఆరు పరుగలకే పెవిలియన్‌ చేరినప్పటికీ.. రోహిత్‌-కోహ్లి జోడి మరో వికెట్‌ పడకుండా విజయాన్ని అందించింది.

అంతకుముం‍దు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. మార్లోన్‌ శామ్యూల్స్‌, జాసన్‌ హోల్డర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌ మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. టీమిండియాతో తొలి మూడు వన్డేల్లో బ్యాటింగ్‌లో రాణించిన వెస్టిండీస్‌.. చివరి రెండు వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. చివరి మ్యాచ్‌లో 104 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను మూటగట్టుకుంది. కాగా.. తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన విండీస్‌.. చివరి రెండు వన్డేల్లో కలిపి 257 పరుగుల్ని మాత్రమే సాధించి 20 వికెట్లను కోల్పోయింది.

ఇక.. చివరి మ్యాచ్‌లో విజృంభించిన టీమిండియా బౌలర్లు.. విండీస్‌ను పేకమేడలా కూల్చేశారు. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ లభించింది.

ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ రెండు అరుదైన రికార్డులు సాధించాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఐదో వన్డేలో చేసిన 63 పరుగులతో కలుపుకుని ఈ ఏడాది రోహిత్ సాధించిన పరుగుల సంఖ్య 1030కి చేరుకుంది. 1202 పరుగులతో కెప్టెన్‌ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read : నిరాశపరిచిన ధావన్.. పోటీ ఇవ్వలేకపోయిన..

మరోవైపు చివరి వన్డేలో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్‌శర్మ.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 187వ ఇన్నింగ్స్‌లో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది 195 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా.. రోహిత్ 187 ఇన్నింగ్స్‌లలోనే ఆ రికార్డును చేరుకున్నాడు. ధోనీ తర్వాత ఆ రికార్డును అందుకున్న ఒకే ఒక్కడు రోహిత్ శర్మే.