ప్రేమించిన వాడే చావమనేసరికి..

ప్రేమించిన ప్రియురాలు ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్.. పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పకపోయినా నిద్రలేని రాత్రులు గడుపుతాడు ప్రియుడు. కలత నిద్రలో ప్రియురాలు కలవరపెడుతుంది. ప్రేమికులుగా ఉన్నంతవరకు అమ్మాయిలు, అబ్బాయిలూ బాగానే ఉంటారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. చెట్ల వెంట, పుట్ల వెంట తిరుగుతారు. నువ్వు లేకపోతే నేను బతకలేనంటారు. ఎవరు అడ్డు వచ్చినా నిన్నే పెళ్ళి చేసుకుంటానంటారు. నిజంగా పెళ్లి చేసుకుందాం అనేసరికి ప్లేటు ఫిరాయిస్తారు. అది తట్టుకోలేని అమ్మాయి లేక అబ్బాయి అఘాయిత్యాలకు పాల్పడతారు. నిండు జీవితాలకి ముగింపు పలుకుతారు.

బెంగళూరుకు చెందిన దివ్య ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న హరీష్ అనే యువకుడు దివ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుందామని ఇంట్లో పెద్దలకు చెప్పారు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దివ్య, హరీష్‌లను వెతికి పట్టుకున్న పోలీసులు వారిని తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Read also : ష్.. ఫ్లైట్‌లో 5 నిమిషాల కంటే ఎక్కువ ఏడ్చావంటే..

ఈ క్రమంలోనే దివ్య పెళ్లిచేసుకోమంటూ హరీష్ మీద ఒత్తిడి తెచ్చింది. చేసుకోకపోతే చనిపోతానంటూ బెదిరించింది. అప్పటికే దివ్యను వదిలించుకోవాలని చూస్తున్న హరీష్‌కు ఓ అవకాశం దొరికినట్లైంది. దివ్య బలహీనత మీద దెబ్బ కొట్టాలని చూసిన హరీష్.. అయితే రూ.15 లక్షలు తీసుకువస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు. అంత డబ్బు నేనెక్కడనుంచి తేగలను అని అనేసరికి.. లేకపోతే నువ్వు చచ్చిపో.. నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని దివ్యను బెదిరించాడు.

ప్రాణంగా ప్రేమించిన వాడే చావమనే సరికి మరో ఆలోచన లేకుండా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు జీవచ్ఛవంలా పడివున్న దివ్యను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. హరీష్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దివ్య మరణవార్త తెలుసుకున్న హరీష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.